Mal reddy Ranga Reddy: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో తనకు స్థానం దక్కకపోయిన విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మాట్లాడుతూ, “తమ మొరను హైకమాండ్ వినలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌తో పోరాడినవారమని, కార్యకర్తలు లేకుండా తాము పనిచేయలేమన్నారు.
“ఇది మా వ్యక్తిగత కోరిక కాదు… కార్యకర్తల డిమాండ్ మేరకే మంత్రిపదవిని కోరుతున్నాం. పార్టీని కాపాడినవారమేమే. ఎలాంటి తప్పు చేయకుండా, పార్టీ లైన్లోనే పనిచేస్తాం,” అని స్పష్టం చేశారు మల్రెడ్డి.
కేవలం ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. “ఇలా చేయడం వలన నిజమైన కార్యకర్తలు నిరుత్సాహానికి లోనవుతారు,” అన్నారు. అలాగే, ప్రతి ఒక్కరూ పార్టీ నియమాలను పాటించి, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా వ్యవహరించాలని సూచించారు.
పది ఉమ్మడి జిల్లాల ప్రతినిధులకూ మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. “కొన్ని జిల్లాలకు రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితిలో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు గతంలో ఆరుగురు మంత్రులు ఉన్నారు. అలాంటి ప్రాతినిధ్యం అవసరం ఉంది,” అని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించాలని పీసీసీ చీఫ్‌ను అభ్యర్థించారు. “చివరికి చెప్పాలంటే, మేము పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాం… ఇప్పుడు పార్టీకి నష్టం జరుగుతోంది. సామాజిక వర్గం అడ్డు అవుతుందనే కారణంతో మంత్రిపదవిని ఇవ్వకపోతే, దాన్ని త్యాగంగా స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను,” అంటూ మల్రెడ్డి మళ్ళీ స్పష్టం చేశారు.