Mahesh Goud

Mahesh Goud: 11 నెలల్లో 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది బాకీ పడటమా?

Mahesh Goud: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుండటంతో తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరుకుంది. గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“తెలంగాణ ఏర్పాటులో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. మేము ఇచ్చిన హామీ అమలు చేస్తాం.. మిగతా వారు బాకీలతో రాష్ట్రాన్ని కూరుకుపోయేలా చేశారు” అని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు

మహేష్ గౌడ్ మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ 8 లక్షల కోట్ల బాకీ తెలంగాణపై మోపారని ఆరోపించారు. “11 నెలల్లో 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది బాకీ పడటమా? మీరు చేసిన అప్పుల వడ్డీలు కూడా మేమే చెల్లిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నాయకులు ‘బాకీ కార్డు’ అంటూ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. “తెలంగాణ మిగులు రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేలా చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఆ బాధ్యతను తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

బీజేపీ-బీఆర్ఎస్‌ మైత్రిపై ఆరోపణలు

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు పదేళ్లు కలిసి నడిచాయని, ఇప్పటికీ అవే తంత్రాలు కొనసాగుతున్నాయని మహేష్ గౌడ్ ఆరోపించారు. “ప్రజలకు మోసం చేసి ఓట్లు దోచుకోవడమే వారి ఎజెండా. కానీ ఈసారి ప్రజలు బుద్ధి చెప్తారు” అన్నారు.

ఇది కూడా చదవండి: jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ స్థానం అంతేనా? సోష‌ల్ మీడియాలో స‌ర్వేల గోల‌

ఎంపీ ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ, “మీరు జీవితాంతం బీసీల పేరుతో ఓట్లు అడుగుతుంటారు. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? ముదిరాజ్ బిడ్డనని చెప్పుకుంటూ కేంద్రాన్ని ఒత్తిడి చేయకపోవడమేంటి?” అని నిలదీశారు.

కాంగ్రెస్ పథకాలపై నమ్మకం

ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలే తమకు బలం అని టీపీసీసీ అధ్యక్షుడు నమ్మకం వ్యక్తం చేశారు. “42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం, 40 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయడం.. ఇవన్నీ మా సంకల్పబలం ఫలితమే. పథకాలు మాకు గెలుపు తెస్తాయి” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ధీమా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మహేష్ గౌడ్ అంచనా వేశారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 నుంచి 85 శాతం సీట్లు మావే. జూబ్లీహిల్స్ బైపోల్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధిస్తాడు” అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *