Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం కుటుంబంతో కలిసి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పుష్కరిణిలో పడి ప్రాణాలు కోల్పోయింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. స్వామి దర్శనానికి ముందు కల్యాణకట్ట సమీపంలోని లక్ష్మీ పుష్కరిణిలో కుటుంబ సభ్యులు స్నానాలు చేస్తుండగా, నాలుగేళ్ల కుమార్తె ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది.
నీటిలో మునిగిపోయిన చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి 8:32 గంటలకు ఆధ్యత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్లముందే అల్లారుముద్దుగా ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
