Pocso Case: మహిళలు మరియు బాలికల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని మహబూబ్‌నగర్ జిల్లా న్యాయస్థానం మరోసారి నిరూపించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లాలోని మహిళలు మరియు పిల్లలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం చారిత్రక తీర్పును వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి నిందితుడి నేరం రుజువు కావడంతో శిక్షతో పాటు భారీ జరిమానాను కూడా ఖరారు చేశారు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చిట్లపల్లి సతయ్య (47) అనే వ్యక్తి, గతేడాది మే 23న ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో భూత్పూర్ ఎస్సై భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ రజిత రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపి పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం భూత్పూర్ సీఐగా ఉన్న రామకృష్ణ పర్యవేక్షణలో కోర్టు లైజన్ అధికారులు సాక్ష్యాధారాలను సమర్థవంతంగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. మొత్తం 8 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి, సతయ్యను దోషిగా తేల్చారు.
ఇది కూడా చదవండి: Venkatesh: ‘మెగా-విక్టరీ’ కలిసి వస్తున్నాం.. మీరు అరిచే అరుపులు మీ ఇంట్లోవాళ్లకి వినపడాలి
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించిన కోర్టు, మానవీయ కోణంలో బాధిత బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ. 5,00,000 (ఐదు లక్షల రూపాయలు) పరిహారం చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిహారం ఆ చిన్నారి కోలుకోవడానికి మరియు చదువుకోవడానికి ఎంతో కొంత అండగా నిలుస్తుందని ఆశించవచ్చు.
కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి, ఏడాదిలోపే నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన భూత్పూర్ పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ డి.జానకి ప్రత్యేకంగా అభినందించారు. బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ తీర్పు సమాజంలో నేరగాళ్లకు ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుందని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.

