SUGAVASI FAMILY STORY: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. ఆ పార్టీ సీనియర్ నేత ఒక్కరు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. నేరుగా అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పటివరకు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలనే చూసాం. తొలిసారిగా అధికార పార్టీకి చెందిన నేత గుడ్ బై చెప్పడం విశేషం. అది కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నేత కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహానాడు జరిగి పది రోజులు కాకమునుపే.. కడప జిల్లాకు చెందిన నేత రాజీనామా చేయడం అంతటా చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా సీనియన్ నేత? ఆయనకొచ్చిన సమస్యేంటి? ఎందుకీ నిర్ణయం తీసుకున్నట్లు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజంపేట నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు, తన తండ్రి పాలకొండ్రాయుడు మరణంపై అధినేత చంద్రబాబు స్పందించకపోవడం, కనీసం పరామర్శించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుగవాసి పాలకొండరాయుడు జనతా పార్టీ అభ్యర్థిగా 1978లో కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండవ సారి రాయచోటి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తెలుగు దేశం పార్టీ నుండి 1984లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న పాలకొండ్రాయుడు కుటుంబం పార్టీకి ఎన్నో సేవలు అందించింది. ఆయన కుమారుడు బాల సుబ్రహ్మణ్యం ప్రస్తుతం రాజంపేటలో టీడీపీకి కీలక నేతగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో పార్టీని వీడుతున్నట్లు సీఎం చంద్రబాబుకు శనివారం లేఖ ద్వారా తెలియజేశారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం.
రాజంపేటలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ వారే సుగవాసి సుబ్రహ్మణ్యంకు వెన్నుపోటు పొడిచారని అయన సోదరుడు ప్రసాద్ బాబు వ్యాఖ్యలు చేశారు. అయితే కొంతకాలంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సుగవాసి సుబ్రహ్మణ్యం పెద్దగా యాక్టివ్‌గా లేరనే చర్చ జరుగుతోంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. రాజంపేట నియోజకవర్గం టీడీపీలో వర్గాలుగా విడిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్‌డే వేడుకల్ని కలిసికట్టుగా కాకుండా.. టీడీపే నేతలు చమర్తి జగన్‌మోహన్‌రాజు, బత్యాల చెంగల్రాయుడు, మేడా విజయశేఖర్‌రెడ్డి వేర్వేరుగా చేశారట. అప్పటి నుండి రాజంపేట రాజకీయాలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
ఇది కూడా చదవండి: Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి..
గత ఎన్నికల్లో పెద్దాయన పాలకొండరాయుడు ఆరోగ్యం సహకరించక పోయినా పార్టీ గెలుపు కోసం కోసం పనిచేసారు. రాజంపేటలో సుగవాసి బాలసుబ్రమణ్యం ఓటమికి టీడీపీలో అంతర్గత విభేదాలు ప్రధాన కారణం. రాజంపేటలో సొంత పార్టీ వ్యక్తులే సుబ్రహ్మణ్యంకు వెన్నుపోటు పొడిచి ఓటమికి కారణం అయ్యారని, సుబ్రహ్మణ్యం ఓటమిని జీర్ణిచుకోలేక మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు తన సొంత మనుషుల దగ్గర బాధపడ్డారని టాక్ నడిచింది. రాజంపేట ఇంచార్జ్‌గా సుబ్రహ్మణ్యంను ప్రకటిస్తారని ఎదురు చూసినా.. చివరికి నిరాశే మిగిలింది. కనీసం సువాసి ప్రసాద్ బాబుకు నామినేటెడ్ పదవి అయినా ఇస్తారని అభిమానులు భావించారు. పెద్దాయన పాలకొండ్రాయుడు రాజకీయ వారసులు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ బాబులు. వీరిద్దరి రాజకీయ ఎదుగుదల చూడాలన్నది పెద్దాయన కోరికగా ఉండేదని చెబుతారు.
గత ఎన్నికల్లో రాజంపేటలో ఓటమి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యంని ఇంచార్జ్‌గా నియమిస్తారని సుగవాసి అభిమానులు భావించారు. ఇంచార్జ్ ఇవ్వకపోగా రాజంపేటలో వర్గపోరు మరింత ఎక్కువైంది. జగన్మోహన్ రాజు, మేడా విజయ్‌శేఖర్ రెడ్డి సొంత వర్గాలుగా ఏర్పడి… ఇంచార్జ్ తామే అంటూ జోరుగా ప్రచారం మెదలు పెట్టారు. రాజంపేట ఎన్నికల్లో జగన్మోహన్ రాజు వర్గం సుబ్రహ్మణ్యంకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించిందన్న మాటలు జోరందుకున్నాయ్. ఎన్నికల్లో వర్గాలుగా ఏర్పడి సుబ్రహ్మణ్యంను ఓడించారన్నది రాజంపేట టీడీపీలో సాగుతున్న చర్చ. ఏది ఏమైనా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మహానాడుకు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజును తాత్కాలిక ఇంచార్జ్‌గా ప్రకటించడం కొసమెరుపు.
2029 ఎన్నికల్లో పార్టీలు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరుతామంటున్నారు సుగవాసి ప్రసాద్ బాబు. ఇక సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేకుంటే వేరే పార్టీలో చేరుతారా? ప్రసాద్ బాబు దారెటు? అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.