Telangana:మద్యంప్రియులను ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో మద్యం ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతున్నది. సంక్షేమ పథకాల రూపంలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని ఢంకా భజాయిస్తున్న పాలకులు అదే ప్రజలపై వివిధ రూపాల్లో భారం మోపుతారనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్క ముందే మద్యం ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిందని ప్రచారం జరుగుతుంది. ఇది కూడా నెలలోపులో మద్యం ధరల బాంబు పేలుతుందని తెలుస్తున్నది.
Telangana:ఇప్పటికే ప్రభుత్వంలో నిర్ణయంపై కసరత్తు జరిగిందని ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రకటనే తరువాయి అన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బ్రూవరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుక ఈ ధరల బాదుడుకు సిద్ధమైందని తెలిసింది. ఆ మేరకు మద్యంపై 20-25 శాతం వరకు ధరలు పెంచాలని భావిస్తున్నదని అంటున్నారు.
Telangana:విశ్వసనీయ సమచారం మేరకు ఒక్కో బీరుపై కనీసం 15 రూపాయల నుంచి 20 రూపాయలు, క్వార్టర్ లిక్కర్ బాటిల్‌పై 10 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెంచేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. వీటిలో చీప్ లిక్కర్ బాటిళ్లపై తక్కువ, ఇతర బ్రాండ్లపై ఎక్కువ పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రతి నెలా సుమారు 500 కోట్ల రూపాయల నుంచి 700 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Telangana:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చింది. ఆ హామీల అమలుకు కసరత్తు చేస్తున్నది. అయితే ఇచ్చిన హామీ అమలుకు ఆలస్యం జరుగుతున్నది. ఖజానాలో సరిపోను సొమ్ము లేకపోవడంతో ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు మూడు మినహా ఇతర పథకాల అమలుకు డబ్బుల్లేక పోవడంతోనే మద్యం ధరల పెంపునకు ముందుకొచ్చిందని భావిస్తున్నారు.