Nana Patekar: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. తన విలక్షణ నటన, పదునైన డైలాగ్ డెలివరీతో వెండితెరపై ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నానా పాటేకర్ (75) గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున ఆయన తీవ్ర గుండెపోటుకు (Cardiac Arrest) గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సాల్కర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం దాదాపు 45 నిమిషాల పాటు నిర్విరామంగా సీపీఆర్ (CPR) చేసి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఉదయం 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం మెడికో-లీగల్ కేస్ (MLC) నమోదు చేసి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
చివరి ప్రసంగంలో చావు గురించి భావోద్వేగ వ్యాఖ్యలు..
మరణానికి కేవలం నాలుగు రోజుల క్రితం, అక్టోబర్ 4న (ఆదివారం) డోనా పౌలాలోని తాజ్ సిదాడే దే గోవా హోటల్‌లో జరిగిన ‘సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్’ వార్షిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నానా పాటేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే ఆయన చివరి పబ్లిక్ అప్పియరెన్స్. తెల్లటి కుర్తా, మెడలో తెల్లటి కండువాతో వేదికపైకి వచ్చిన ఆయన, మరణం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ వ్యక్తిత్వాన్ని, రాజకీయ శైలిని కొనియాడిన అనంతరం నానా పాటేకర్ మరాఠీలో మాట్లాడుతూ..
మనమందరం ఏదో ఒక రోజు వెళ్లిపోవాల్సిందే (చనిపోవాల్సిందే). రేపటి రోజున నేను ఇక్కడ ఉంటానో లేదో కూడా నాకు తెలీదు. ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక రోజు ఆ ముగింపు దశకు చేరుకుంటుంది. కానీ ఆ సమయం రాకముందే నేను నన్ను ఒక ప్రశ్న వేసుకోవాలి: నా జీవితంలో నేను చేయాలనుకున్నది నిజంగా చేయగలిగానా లేదా?
ఆయన మాట్లాడిన నాలుగు రోజులకే ఇలా శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
వెండితెరపై తిరుగులేని నటన – నానా మార్క్ స్టైల్..
1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన విశ్వనాథ్ పాటేకర్.. ‘నానా పాటేకర్’గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
-
ప్రారంభం & బ్రేక్‌త్రూ: 1978లో వచ్చిన ‘గమన్’తో అడుగుపెట్టి, ‘సలామ్ బాంబే’, ‘పరిందా’ చిత్రాలతో స్టార్‌డమ్ సాధించారు.
-
ఐకానిక్ క్యారెక్టర్లు: క్రాంతివీర్, తిరంగా, అంగార్, ఖామోషి: ది మ్యూజికల్, యశ్వంత్, అబ్ తక్ ఛప్పన్, అపహరణ్, రాజ్‌నీతి చిత్రాల్లో ఆయన చెప్పిన డైలాగులు మిమిక్రీ ఆర్టిస్టులకు ఒక బెంచ్‌మార్క్‌గా మారాయి.
-
దర్శకుడిగా: 1991లో భారత ఆర్మీ నేపథ్యంలో వచ్చిన ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు.
-
కామెడీలోనూ సూపర్ హిట్: సీరియస్, యాంగ్రీ పాత్రలకే పరిమితం కాకుండా ‘వెల్‌కమ్’ ఫ్రాంచైజీలో ‘ఉదయ్ శెట్టి’గా ఆయన పండించిన హాస్యం నేటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది.
-
చివరి సినిమా: ఇటీవల షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, అవినాష్ తివారీ, దిశా పటానీలతో కలిసి నటించిన ‘ఓ రోమియో’ ఆయన చివరి సినిమాగా నిలిచింది.
అవార్డులు & రైతులు, సైనికుల కుటుంబాలకు ఆపద్భాంధవుడు:
సినీ రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన ఖాతాలో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు (National Awards), నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఉన్నాయి.
తెరపై నటుడిగానే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన గొప్ప సమాజ సేవకుడిగా నిలిచారు. కరవు బారిన పడిన మహారాష్ట్ర రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ‘నామ్ ఫౌండేషన్’ (Naam Foundation) స్థాపించి నిరంతరం అండగా నిలిచారు.
ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో నష్టపోయిన కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించి, తన ఎన్జీవో ద్వారా వారికి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. ఒక నిజాయితీగల నటుడిని, గొప్ప మనసున్న వ్యక్తిని భారత చిత్ర పరిశ్రమ కోల్పోయిందని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
