KTR

KTR: రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తప్పుకోవాల్సిందే!

KTR: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు హక్కును కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ చేసిన పోస్ట్ దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

140 కోట్ల మంది హక్కుల కంటే ఒక వ్యక్తి గొప్పవాడా?.. కేటీఆర్ ఘాటు ప్రశ్నలు

రాజ్యాంగ విలువలు, పౌరుల ఓటు హక్కు పరిరక్షణపై కేటీఆర్ తన పోస్టులో స్పష్టమైన వైఖరిని చాటారు..
రాజ్యాంగమే అత్యున్నతం..
“భారత రాజ్యాంగం కంటే ఏ ఒక్క వ్యక్తీ లేదా సంస్థ గొప్పవారు కారు. ఏ ఒక్క భారతీయ పౌరుడు కూడా తన ప్రాథమిక ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఉండకూడదు. జ్ఞానేష్ కుమార్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందే!” అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకింత ఆరాటం?..
దేశంలో ఎంతోమంది వ్యక్తులు వచ్చారు.. పోయారు. కానీ భారతదేశం ఎల్లప్పుడూ బలంగా, అందంగా నిలబడింది. అలాంటిది ఒకే ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఇంత ఆరాటం ఎందుకు? 140 కోట్ల మంది భారతీయుల ప్రజాస్వామ్య హక్కుల కంటే ఆ ఒక్క వ్యక్తి ఎలా గొప్పవాడవుతారు? అంటూ నిలదీశారు.
సమయం ముగిసింది..
దేశ ఆత్మను దెబ్బతీస్తూ సమాంతర ప్రత్యామ్నాయ వ్యవస్థలను నిర్మించాలని ప్రయత్నించే వారికి కాలం చెల్లిందని ఆయన హెచ్చరించారు.
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరగాలి..
ఎస్ఐఆర్ (SIR) వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కోట్లాది మంది ఓటర్ల పేర్ల తొలగింపు, జాబితాల సవరణలో చోటుచేసుకున్న అవకతవకలను సుప్రీంకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు.
సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు..
ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు మళ్లీ విశ్వాసం కలగాలంటే.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఓ పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు.
ఇప్పటికే విపక్షాలు, పౌర సమాజం ఎస్ఐఆర్ రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న తరుణంలో.. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కూడా ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడం తాజా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *