Social Media

Social Media: టీనేజర్ల సోషల్ మీడియా వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం..!

Social Media: పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక దిశగా అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియా తరహాలో 16 లేదా 18 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం (Blanket Ban) కంటే, ఆయా సోషల్ మీడియా సంస్థలే బాధ్యత తీసుకుని టీనేజర్ల వినియోగాన్ని నియంత్రించేలా చూడాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ (MeitY) భావిస్తోంది. పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేయడం కంటే, ఆ ప్లాట్‌ఫారమ్‌లనే వారికి సురక్షితంగా మార్చడమే సరైన పరిష్కారమని అధికారులు యోచిస్తున్నారు.

ఇందుకోసం అమెరికాలో మెటా (Meta) ప్రతిపాదించిన తరహా నిబంధనలను భారత్‌లోనూ అమలు చేయాలని కేంద్ర ఐటీ శాఖ పరిశీలిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం టీనేజర్ల సోషల్ మీడియా వాడకంపై కీలక ఆంక్షలు ఉండనున్నాయి. రోజుకు గరిష్టంగా రెండు గంటలు మాత్రమే సోషల్ మీడియా వాడుకునేలా పరిమితి విధించడంతో పాటు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కూల్ వేళల్లో నోటిఫికేషన్లు రాకుండా మ్యూట్ చేయనున్నారు. అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు యాప్ పనిచేయకుండా నియంత్రించడంతో పాటు, స్మార్ట్ డివైజ్‌ను వరుసగా 15 నిమిషాలు వాడితే ఆటోమేటిక్‌గా అలర్ట్ మెసేజ్ ఇచ్చి కాసేపు విరామం తీసుకోమని హెచ్చరికలు పంపేలా ఫీచర్లు తీసుకురానున్నారు. అయితే, ఈ నిబంధనలను సడలించాలన్నా లేదా మార్చాలన్నా తల్లిదండ్రుల అనుమతి (Parental Control) తప్పనిసరి చేయనున్నారు.
పూర్తి నిషేధం ఎందుకు వద్దనుకుంటున్నారంటే.. గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించినప్పటికీ, పిల్లలు తప్పుడు పుట్టిన తేదీలు ఇచ్చి కొత్త అకౌంట్లు తెరవడంతో అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. భారత్‌లోనూ పూర్తి నిషేధం విధిస్తే టీనేజర్లు నియంత్రణ లేని ఇతర ప్రమాదకర యాప్‌ల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, పైగా వయసు నిర్ధారణ పేరుతో కంపెనీలు ప్రజల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, డేటాను ఎక్కువగా సేకరిస్తే అది సైబర్ భద్రతకు ముప్పుగా మారుతుందని డిజిటల్ హక్కుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, భారత్‌లో అమల్లో ఉన్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP Act) ప్రకారం 18 ఏళ్లలోపు వారందరూ చిన్నారులే కాబట్టి, వారి వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయాలంటే తల్లిదండ్రుల ధ్రువీకరించిన అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలకు అనుగుణంగానే వాట్సాప్ ఇప్పటికే భారత్‌లో కొందరు యూజర్ల పుట్టిన తేదీని నిర్ధారించుకునే ప్రక్రియను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. మొత్తానికి పూర్తి నిషేధం బదులు టెక్ కంపెనీలపైనే బాధ్యత ఉంచి, టీనేజర్లలో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పెంపొందించేలా కేంద్రం ఈ కొత్త నిబంధనలకు రూపకల్పన చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *