Supreme Court: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై గత ట్రైబ్యునల్ నిర్ణయాలతో పాటు, ప్రస్తుత కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ (KWDT-II) పరిధి, విధివిధానాల (Terms of Reference) విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ సర్కార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు విచారణ – ఏపీ ప్రభుత్వ వాదన..
జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. కృష్ణా ట్రైబ్యునల్‌లో వాదనల ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ట్రైబ్యునల్ ఇచ్చే ఉత్తర్వులు సుప్రీంకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి గుర్తుచేసింది. అందువల్ల ఈ పిటిషన్‌పై విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 13కి విచారణ వాయిదా..
ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను, అంశం తీవ్రతను పరిశీలించిన జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 13వ తేదీన చేపట్టనున్నట్లు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కృష్ణా జలాల కేటాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారనుంది.
