Kakinada AE Case: కాకినాడ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మూడు రోజుల కస్టడీలో భాగంగా నిందితుడు సాదిక్‌ను సర్పవరం పోలీసులు రెండో రోజూ విస్తృతంగా విచారించారు. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేయగా, చాలా ప్రశ్నలకు సాదిక్ సమాధానాలు దాటవేస్తూ పోలీసులనే ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఒకవైపు సాదిక్ చెప్పే మాటలను విశ్లేషిస్తూనే.. మరోవైపు తమ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు (CDR), సాంకేతిక ఆధారాలతో పోలీసులు సరిపోల్చి చూస్తున్నారు.
విచారణలో కీలక అంశాలు – సాదిక్ సమాధానాలు..
సాదిక్‌తో నిరంతరం ఫోన్ సంభాషణల్లో ఉన్న నలుగురు సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత సాదిక్ వీరికి ఏ సమాచారం చేరవేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. జగదీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సాదిక్ హడావుడిగా హైదరాబాద్ ఎందుకు వెళ్లాడనే అంశంపైనా పోలీసులు లోతుగా కూపీ లాగుతున్నారు. మూడు రోజుల కస్టడీలో ఇప్పటికే రెండు రోజులు ముగియగా, మిగిలిన చివరి ఒక్కరోజు కస్టడీలో సాదిక్ నుంచి హత్యకు సంబంధించిన కీలక నిజాలను రాబట్టేందుకు పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
