Kishan Reddy: తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఉప్పుగూడ, మలక్‌పేట రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పలు ఆధునికీకరణ పనులను ఆయన స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులతో కలిసి పనుల నాణ్యత, కాలపరిమితిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
డిసెంబర్ కల్లా ఉప్పుగూడ స్టేషన్ పునరాభివృద్ధి
అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) కింద ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ స్టేషన్ ముఖచిత్రాన్ని మార్చేందుకు అలాగే ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించిందని చెప్పారు. రాబోయే డిసెంబర్ నాటికి ఈ ఆధునికీకరణ పనులన్నింటినీ పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫారాలు, మెరుగైన లైటింగ్, ప్రయాణికుల విశ్రాంతి గదులు (Waiting Halls) తాగునీటి వసతుల ఏర్పాటు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ పొడిగింపు
హైదరాబాద్ మహానగర ప్రయాణికులకు, ముఖ్యంగా భక్తులకు మరో తీపి కబురు అందిస్తూ, ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ పొడిగింపుపై మంత్రి కీలక ప్రకటన చేశారు. భాగ్యనగరం (హైదరాబాద్) నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను పొడిగించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనివల్ల నిత్యం నగరానికి వచ్చే వేలాది మంది భక్తులకు, స్థానిక ఉద్యోగులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెరిగిన రైల్వే నెట్‌వర్క్
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. గత 12 ఏళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 347 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను నిర్మించినట్లు ఆయన గణాంకాలతో సహా వివరించారు. కొత్త లైన్ల నిర్మాణంతో పాటు రైల్వే లైన్ల విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులను కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నామని, భవిష్యత్తులో తెలంగాణలో రైల్వే రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
