Danam Nagender

Danam Nagender: విస్మరించారు కాబట్టే వదలాల్సి వచ్చింది..

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ రాజకీయాల్లో కీలక కదలిక మొదలైంది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈనెల 30వ తేదీన (శుక్రవారం) విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది.

అసలు వివాదం ఏమిటి?

బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే స్పీకర్ ఇప్పుడు విచారణకు సిద్ధమయ్యారు.

ఇది కూడా చదవండి: Prabhas: ‘కల్కి 2898 ఏడీ’సీక్వెల్‌ కి డేట్స్ ఇచ్చిన ప్రభాస్..

దానం నాగేందర్ వివరణ..

ఈ నోటీసులపై దానం నాగేందర్ స్పందిస్తూ ఇప్పటికే ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఆయన ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఆ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదని వివరించారు. గత ఏడాది మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళింది కేవలం వ్యక్తిగత హోదాలోనేనని, మీడియా వార్తల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని ఆయన వాదించారు. పాత కోర్టు తీర్పుల ప్రకారం తనపై దాఖలైన ఈ పిటిషన్ చెల్లుబాటు కాదని, దీన్ని కొట్టివేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

ప్రజలే నా బలం..

ఈ వ్యవహారంపై మీడియాలో మాట్లాడిన దానం.. తాను పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. “నన్ను విస్మరించారు కాబట్టే వదలాల్సి వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజలే నా నిర్ణయాలకు బలం. స్పీకర్ అడిగే ప్రశ్నలకు చట్టప్రకారం సమాధానం చెబుతాను, లీగల్‌గా పోరాడుతాను” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *