KCR

KCR: నీటి పోరుకు కేసీఆర్ సిద్ధం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సమరశంఖం!

KCR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రాజెక్టు నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దక్షిణ తెలంగాణ రైతులకు శాపంగా మారబోతున్నాయని ఆయన మండిపడ్డారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

దక్షిణ తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు మూడు ఉమ్మడి జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ఒక సభ, నల్గొండ జిల్లాలోని దేవరకొండ లేదా కొండమల్లేపల్లిలో రెండో సభ, మరియు మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యంత భారీ స్థాయిలో మూడో సభను నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ సభలకు కేసీఆర్ స్వయంగా హాజరై ప్రసంగించబోతుండటంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, మళ్లీ తెలంగాణ ఉద్యమ నినాదాలైన ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అజెండాతోనే ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులను పోలుస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సంక్రాంతి పండుగ లోపు లేదా ఆ తర్వాత ఈ సభలు వరుసగా జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *