Bandi Sanjay Son: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయి చుట్టూ ఇప్పుడు వివాదం నెలకొంది. తనను హనీట్రాప్ చేసి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ భగీరథ్ పోలీసులను ఆశ్రయించగా, ప్రతిగా అవతలి పక్షం ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారింది.
రూ. 5 కోట్ల డిమాండ్.. భగీరథ్ ఫిర్యాదు
భగీరథ్ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ (FIR) ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబం తనను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. సాధారణ స్నేహితుల ద్వారా సదరు యువతితో భగీరథ్‌కు పరిచయం ఏర్పడింది. కొంతకాలం పాటు వారు స్నేహంగా ఉంటూ కుటుంబ వేడుకలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా వెళ్లారు. అయితే, ఆ యువతిని వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు భగీరథ్‌పై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆయన నిరాకరించడంతో వేధింపులు మొదలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ మాట వినకపోతే వేధింపులు, శారీరక సంబంధం వంటి అబద్ధపు ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భయం వల్ల మొదట ఆ యువతి తండ్రికి భగీరథ్ రూ. 50,000 చెల్లించారు. కానీ, ఆ తర్వాత ఏకంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని, లేదంటే యువతి తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో వివరించారు. ఇదే కుటుంబం గతంలో తన స్నేహితులను కూడా ఇలాగే ఇబ్బంది పెట్టిందని, వారిపై నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఉందని భగీరథ్ పేర్కొన్నారు.
ఎదురుదాడి: పోక్సో (POCSO) కేసు డిమాండ్
భగీరథ్ ఫిర్యాదు చేసిన తర్వాత, సదరు యువతి కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగారు. ఆ యువతి మైనర్ అని పేర్కొంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భగీరథ్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. భగీరథ్ ముందే చెప్పినట్లుగా, తనపై అబద్ధపు కేసులు పెడతారన్న అనుమానం ఇప్పుడు నిజమైందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
రాజకీయ వేడి
కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ప్రస్తుతం బిఎన్ఎస్ (BNS) సెక్షన్స్ 308(5), 351(2), 61(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందే, కరీంనగర్లో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ఈ హనీట్రాప్ మరియు ఎదురు దాడుల ఉదంతం బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం నేరపూరితమైన బ్లాక్ మెయిలింగ్ ఉదంతమా లేక దీని వెనుక రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
