NTR: సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెను విప్లవం సృష్టిస్తున్న సమయంలో.. కొందరు వికృత మనస్తత్వంతో దాన్ని దుర్వినియోగం చేస్తూ సమాజానికి ప్రమాదకరంగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు సినీ నటీమణులను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా బ్లాక్‌బస్టర్ సినిమా ‘దేవర: పార్ట్ 1’లోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ పై ఏఐ మార్ఫింగ్ వీడియో వైరల్ కావడం తీవ్ర దుమారం రేపింది.
ఈ పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్‌ను అత్యంత అసభ్యకరంగా, జూనియర్ ఎన్టీఆర్‌ను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ ఓ వీడియో క్లిప్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఈ వికృత చేష్టపై నెటిజన్లు, సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్వయంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిగ్గుమాలిన చర్య.. ఎవరినీ వదిలిపెట్టను!.. ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
అత్యంత అసహ్యకరమైన, దిగజారిన, సిగ్గుమాలిన చర్య! మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ పవిత్ర నేలపై.. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం మాట మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటిది కేవలం పైశాచిక ఆనందం కోసం ఏఐని ఉపయోగించి ఓ మహిళను అత్యంత కించపరిచేలా వ్యవహరించడం శోచనీయం. ఇంతటి దౌర్భాగ్యపు పనిని ఏఐతో చేయడం మాటల్లో వర్ణించలేనంత సిగ్గుచేటు” అని ఎన్టీఆర్ మండిపడ్డారు.
లీగల్ యాక్షన్ తప్పదు..
“ఈ మార్ఫింగ్ చుట్టమల్లే వీడియో వెనుక ఉన్న నీచులను హెచ్చరిస్తున్నా.. మీలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు! ఈ అసభ్యకరమైన వీడియోను క్రియేట్ చేసిన వారిపై, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరిపై సాధ్యమైన అన్ని కఠిన చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటాం” అంటూ తేల్చిచెప్పారు.
ఇవాళ వేరొకరు.. రేపు మీ ఇంట్లోని అమ్మ, చెల్లి కావచ్చు!
ఈ సందర్భంగా ప్రజలకు, నెటిజన్లకు ఎన్టీఆర్ ఓ కీలకమైన విజ్ఞప్తి చేశారు.. ఇలాంటి మార్ఫింగ్, డీప్‌ఫేక్ కంటెంట్‌ను ఎవరూ చూడొద్దని, ఎక్కడా షేర్ చేయొద్దని, ఎలాంటి ఎంగేజ్మెంట్ ఇవ్వొద్దని కోరారు. గుర్తుంచుకోండి.. ఇవాళ ఇది వేరొకరికి జరగొచ్చు.. కానీ రేపు ఇదే వికృత చేష్ట మీ తల్లి, సోదరి, భార్య లేదా మీ కూతురికి కూడా ఎదురవ్వొచ్చు” అంటూ భావోద్వేగంతో హెచ్చరించారు. ఇది అత్యంత తీవ్రమైన సమస్య అని పేర్కొంటూ.. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భారత కేంద్ర ప్రభుత్వం ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, నిబంధనలను తక్షణమే తీసుకురావాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.
‘చుట్టమల్లే’ క్రేజ్ & ‘దేవర’ నేపథ్యం..
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ యాక్షన్ డ్రామా సినిమా ‘దేవర: పార్ట్ 1’. 1980ల తీరప్రాంతం నేపథ్యంలో అక్రమ స్మగ్లింగ్‌ను అడ్డుకునే శక్తిమంతమైన సముద్ర యోధుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. ఎన్టీఆర్, జాన్వీ మధ్య వచ్చే మెలోడీ రొమాంటిక్ సాంగ్ ‘చుట్టమల్లే’ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సెన్సేషనల్ రికార్డులను సృష్టించింది. అలాంటి పాటను ఇలా డీప్‌ఫేక్ మార్ఫింగ్ చేయడంపై సినీ ప్రేమికులంతా ఎన్టీఆర్ తీసుకున్న స్టాండ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. ‘కేజీఎఫ్’, ‘సాలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌పై దృష్టి సారించారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

