Jhansi IAS: లక్ష్మీరాయ్ ముఖ్య పాత్రధారిణిగా గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో రిలీజ్ అయిన సినిమాను ‘ఝాన్సీ ఐపిఎస్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు ప్రతాని రామకృష్ణ గౌడ్. 29న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎ.ఎం. రత్నం, సుమన్ హాజరయ్యారు. విజయశాంతికి జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన ‘కర్తవ్యం’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసిన రత్నం అతిథిగా రావటం ఆనందంగా ఉందన్నారు నిర్మాత రామకృష్ణ గౌడ్. సినిమాలు పలువురుకి స్ఫూర్తిగా నిలుస్తాయని, ‘కర్తవ్యం’తో అమ్మాయిలు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తే, ‘భారతీయుడు’తో ఉద్యోగులు లంచాలు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారని, ‘బాయ్స్’ సినిమా చూసి సినిమా అవకాశాలకోసం ప్రయత్నించానని యశ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఎ.ఎం. రత్నం. ఇక సుమన్ మాట్లాడుతూ ‘అప్పట్లో మా సినిమాలు చూసి కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు మహిళలు మరింతగా పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఝాన్సీ ఐపీఎస్ ఆ స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
