Jahnavi Dangeti: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి దంగేటి జాహ్నవి, అంతరిక్ష ప్రయాణానికి ఎంపిక కావడం గర్వకారణం. చిన్న పట్టణంలో పుట్టిన ఆమె… ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతుంది. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్‌లో ఆమె Astronaut Candidate (ASCAN)గా ఎంపికైంది. ఇది దేశానికి, రాష్ట్రానికి, పాలకొల్లుకు గర్వించదగిన విషయం.
జాహ్నవి తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీలు కువైట్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, జాహ్నవి మాత్రం తన విద్యాభ్యాసాన్ని భారతదేశంలో కొనసాగించింది. పాలకొల్లులో ఇంటర్ పూర్తిచేసిన ఆమె, పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసింది.
అంతరిక్షం పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న జాహ్నవి, 2022లో పోలాండ్‌లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంది. అంతే కాకుండా, NASA నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి, ఆ ఘనత సాధించిన మొదటి భారతీయురాలిగా నిలిచింది.
జాహ్నవి ఇప్పటివరకు అనేక అరుదైన శిక్షణలు తీసుకుంది..
-
జీరో గ్రావిటీ ట్రైనింగ్
-
మల్టీ యాక్సిస్ సిమ్యూలేషన్
-
అండర్ వాటర్ రాకెట్ లాంచ్
-
ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్
-
స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్ శిక్షణ
-
సెస్నా 171 స్కైహాక్ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా నడిపింది
ఆమె 16 దేశాల యువతితో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. అంతరిక్ష ప్రయాణానికి కావాల్సిన బహుళ నైపుణ్యాలను ఆమె ముందుగానే సాధించుకుంది.
ఇది కూడా చదవండి: Donald Trump: యూఎస్ మహిళలు భారత్ కి ఒంటరిగా వెళ్లొద్దు.. ట్రంప్ కీలక వాక్యాలు
ఇప్పటివరకు:
-
NASA స్పేస్ యాప్స్ ఛాలెంజ్‌లో పీపుల్స్ చాయిస్ అవార్డు గెలిచింది
-
ISRO వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డు అందుకుంది
-
ఖగోళ శాస్త్రంలో ఆసక్తితో ఆస్టరాయిడ్‌లను గుర్తించే పరిశోధనల్లో కూడా పాల్గొంది
2026 నుంచి 3 ఏళ్లపాటు, టైటాన్ స్పేస్ సంస్థ ఇచ్చే గట్టిగా వ్యోమగామి శిక్షణలో పాల్గొనబోతున్న జాహ్నవి, 2029లో 5 గంటలపాటు సాగే ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్‌లో పాల్గొననుంది. ఇందులో భాగంగా శాస్త్రీయ పరిశోధనలు చేయనుంది.
జాహ్నవి మాట్లాడుతూ..
“నేను చిన్న పట్టణంలో జన్మించాను. కానీ, ఎన్నో కష్టాలను దాటి ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నేను మరిన్ని గ్రామీణ యువతకు ప్రేరణగా నిలవాలనుకుంటున్నాను. అంతరిక్షంలోకి వెళ్లే వారి కలలకు ఊపిరి అందించాలనుకుంటున్నాను.“
తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నా, జాహ్నవికి మార్గదర్శకురాలిగా నిలిచింది ఆమె అమ్మమ్మ లీలావతి. ఆమె చెప్పిన చందమామ కథలే జాహ్నవికి స్పేస్ పట్ల ఆసక్తిని కలిగించాయి. ఐదవ తరగతిలోనే కరాటే నేర్చుకొని, నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ అందుకున్న ఆమె… స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి రంగాల్లో శిక్షణ పొందింది.
ఈ కథ ఒక చిన్న పట్టణం నుంచి అంతరిక్షం వరకు ప్రయాణించిన ధైర్యవంతురాలి జీవన యాత్ర. ఆమె సాధించిన విజయాలు ఎన్నో యువతకు ప్రేరణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
జాహ్నవి అంటే గర్వంగా అనిపించే పేరు!

