Jagadeesh reddy: బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎక్స్ వేదికగా ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు.
“కవితమ్మకు నా జ్ఞాన జోహార్లు” — జగదీశ్ రెడ్డి
“నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రాధాకృష్ణ, రేవంత్‌లు నా గురించి ఏం మాట్లాడారో వాటినే ఆమె వల్లే వేసే ప్రయత్నం చేసింది. అందుకు నా సానుభూతి,” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కవిత వ్యాఖ్యలను సూటిగా ఖండించిన ఆయన, స్వయంగా ఉద్యమంలో తన పాత్రను ప్రస్తావించారు.
పార్వతిపురంలో కవిత ఫైర్
ఇంతకుముందు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, “కవితను బీఆర్ఎస్ పార్టీ లో ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరు. ఆమె కేవలం ఒక ఎమ్మెల్సీ మాత్రమే,” అన్న వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. “జగదీశ్ లిల్లీపుట్ నాయకుడు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌ను సర్వనాశనం చేసింది అదే నాయకత్వం. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ లేకపోతే మీరు ఎవరు? — కవిత
తనపై విమర్శలు చేయడం వాస్తవానికి పార్టీ వ్యవస్థపై దాడిచేయడమేనని కవిత అభిప్రాయపడుతున్నారు. “కేసీఆర్ లేకపోతే మీరు ఎవరు? పార్టీ స్థాపనకి, ఉద్యమానికి ఎంత మద్దతిచ్చారో అందరికీ తెలుసు,” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.