Mojtaba Khamenei: ఇరాన్ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) మొజ్తబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నప్పటికీ, ఆయన గతానికి భిన్నంగా తీవ్ర శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఒక వివరాత్మక కథనాన్ని వెలువరించింది. తన తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన మొజ్తబా, ఒక దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంటూ దేశాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర గాయాలు.. వీడని భయం!
ఖమేనీ శారీరక స్థితిపై ఇరాన్ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ వెలువడిన ఈ నివేదిక కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది.
-
శస్త్రచికిత్సలు: ఆయన ఒక కాలికి ఇప్పటికే మూడుసార్లు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన ఒక కృత్రిమ కాలు (Prosthetic) కోసం వేచి చూస్తున్నారు.
-
మాట్లాడటం కష్టం: దాడిలో ఆయన ముఖం, పెదవులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ఆయన మాట్లాడటం చాలా కష్టంగా మారింది. భవిష్యత్తులో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
-
బలహీనతను దాచే ప్రయత్నం: తాను బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తే దేశంలో తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఏ రకమైన వీడియో సందేశాలు ఇవ్వడం లేదని, అజ్ఞాతంలోనే ఉంటున్నారని సమాచారం.
హ్యాండ్ రైటింగ్ నోట్స్.. హ్యూమన్ చైన్!
ఇజ్రాయెల్ దాడుల భయంతో ఖమేనీ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా మార్చేశారు.
-
రహస్య మార్పిడి: సందేశాలను కాగితంపై రాసి, సీలు చేసిన కవర్లలో ఉంచి, కార్లు లేదా మోటార్ సైకిళ్ల ద్వారా ఒకరి నుండి ఒకరికి చేరవేస్తున్నారు.
-
అధికారుల దూరం: ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అధికారుల కదలికలను గమనించి తనపై దాడి చేస్తాయనే భయంతో సీనియర్ మంత్రులు కూడా ఆయనను నేరుగా కలవడం లేదని నివేదిక పేర్కొంది.
పట్టు సాధిస్తున్న ‘రివల్యూషనరీ గార్డ్స్’
ఖమేనీ ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోవడంతో, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్లు నిర్ణయాధికారంలో ప్రాధాన్యత సంతరించుకున్నారు.
-
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్: “మొజ్తబా ఒక కంపెనీ డైరెక్టర్లా ఉంటే, జనరల్స్ అందరూ బోర్డు సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు. దేశ రక్షణ, దౌత్యంపై వారే ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని మాజీ ప్రభుత్వ సలహాదారు అబ్దుల్ రెజా దవారీ పేర్కొన్నారు.
-
పౌర నాయకుల నిర్లక్ష్యం: అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి పౌర నాయకులు వ్యూహాత్మక నిర్ణయాల్లో పక్కకు నెట్టబడ్డారు.
దౌత్యంపై ప్రభావం
సైన్యం పట్టు పెరగడం వల్ల అమెరికాతో జరగాల్సిన దౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతున్న సమయంలో చర్చలు వద్దని జనరల్స్ మొండికేయడంతో చర్చలు విఫలమయ్యాయి. అయితే, అధికారం ఒక వ్యక్తి నుండి ఒక సైనిక కూటమి చేతుల్లోకి మారినప్పటికీ, ఇరాన్ రాజకీయ వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
