Shubhanshu Shukla: భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు ముహూర్తం ఖరారైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యాక్సియం-4 (AX-4) మిషన్‌లో భాగంగా, ఈనెల 25న (బుధవారం) శుభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది.
యాక్సియం-4 మిషన్ ప్రయోగం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరగనుంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్ ఈ స్పేస్ క్యాప్సూల్‌ను నింగిలోకి మోసుకెళ్తుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కానుంది.
ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఈ రోదసియాత్రను చేపట్టనున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌ను నిర్వహిస్తుండగా, ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ), నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ), ఈఎస్‌ఏ (ఐరోపా అంతరిక్ష సంస్థ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి.
Also Read: Trump: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
Shubhanshu Shukla: వాస్తవానికి, ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉంది. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయి, ప్రయోగానికి రంగం సిద్ధమైంది.
భూమి నుండి బయలుదేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో విజయవంతంగా అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం ISSలో 14 రోజుల పాటు బస చేస్తుంది. ఈ సమయంలో, వారు భూమి యొక్క గురుత్వాకర్షణకు దూరంగా, భారరహిత స్థితిలో పలు కీలక ప్రయోగాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా, అంతరిక్షం నుండే ప్రధానమంత్రి మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతర ప్రముఖులతో సంభాషించనున్నారు. ఈ యాత్ర భారత అంతరిక్ష రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది.