New Chief of Defence Staff

New Chief of Defence Staff: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి, నేవీ చీఫ్‌గా కృష్ణ స్వామినాథన్

New Chief of Defence Staff: భారత రక్షణ దళాల నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (రిటైర్డ్) నియమితులయ్యారు. అదేవిధంగా, భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ఈ ఏడాది మే 30తో ముగియనుండగా, ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు.

దేశ భద్రతా వ్యవస్థలో అత్యున్నత పదవులకు సంబంధించి వెలువడిన ఈ నియామకాలు రక్షణ రంగంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఇద్దరు అధికారులు తమ తమ రంగాల్లో దశాబ్దాల అనుభవం కలిగిన యుద్ధ తంత్ర నిపుణులు.

తదుపరి సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి

లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (NSCS)లో సైనిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన భారత సైన్యంలో వైస్ చీఫ్ (VCOAS)గా పనిచేసి గత ఏడాది జూలై 31న పదవీ విరమణ చేశారు. మే 30న బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన సీడీఎస్‌తో పాటు మిలిటరీ అఫైర్స్ విభాగం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు.

 ఆయన 1985 డిసెంబర్ 14న గర్వాల్ రైఫిల్స్ 8వ బెటాలియన్‌లో కమిషన్ పొందారు. ఆపరేషన్ రైనోలో భాగంగా అస్సాంలో 16 గర్వాల్ రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో 168 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ ఇంకా సెంట్రల్ సెక్టార్‌లో 17 మౌంటైన్ డివిజన్‌కు కమాండర్‌గా పనిచేశారు. పశ్చిమ సరిహద్దులో భారత సైన్యపు అత్యంత కీలకమైన ‘2 కోర్’ స్ట్రైక్ కోర్‌కు నాయకత్వం వహించిన ఘనత ఆయనకు ఉంది. ఆయన విశిష్ట సేవలకు గానూ పివిఎస్ఎమ్ (PVSM), ఎవిఎస్ఎమ్ (AVSM), సేవా మెడల్ (SM),  విఎస్ఎమ్ (VSM) పురస్కారాలు లభించాయి.

కొత్త నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్

భారత నౌకాదళ తదుపరి చీఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నేవల్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేయనుండగా, అదే రోజున స్వామినాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు.

వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్థానంలోని విశేషాలు..

ఆయన 1987 జూలై 1న భారత నౌకాదళంలో చేరారు. ప్రముఖ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు ఆయన కమాండర్‌గా వ్యవహరించారు. గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, మిస్సైల్ కార్వెట్ ఐఎన్ఎస్ కులిష్, మిస్సైల్ వెసెల్స్ ఐఎన్ఎస్ విద్యుత్ మరియు వినాష్‌లకు ఆయన నాయకత్వం వహించారు. కమ్యూనికేషన్ ఇంకా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విభాగాల్లో ఆయనకు అపారమైన నైపుణ్యం ఉంది.

ఈ కీలక నియామకాల ద్వారా భారత రక్షణ దళాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని, సరిహద్దు రక్షణ మరియు సముద్ర భద్రతలో నూతన వ్యూహాలు అమలులోకి వస్తాయని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *