Market Trends: భారత వినియోగ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త తరం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన ‘జెన్ జీ’ (Gen Z) తరం ఇప్పుడు కేవలం ఒక జనాభా విభాగంగా కాకుండా, దేశ కొనుగోలు శక్తిని నడిపించే ప్రధాన ఇంజన్ గా మారుతోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) మరియు స్నాప్ (Snap Inc.) సంయుక్త నివేదిక ప్రకారం, భారత్‌లో ప్రస్తుతం సుమారు 37.7 కోట్ల మంది Gen Z జనాభా ఉండగా, భారత దేశంలో ఉన్న జనాభా ఖర్చు చేస్తున్న (డబ్బు) వ్యయంలో వీరి ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం ఏకంగా 43 శాతంగా ($860 బిలియన్లలో దాదాపు $370 బిలియన్లు) ఉంది. రాబోయే కాలంలో ఈ ప్రభావం మరింత పెరిగి, 2035 నాటికి వీరి వ్యయం $2 ట్రిలియన్లకు చేరుతుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
సొంత డబ్బు కాకపోయినా.. కొనుగోళ్లపై భారీ ప్రభావం..
ప్రస్తుతం Gen Z ప్రభావం చూపుతున్న $860 బిలియన్లలో సుమారు $660 బిలియన్లు వారి సొంత ఆదాయం కాదు. కుటుంబంపై ఆధారపడే ఈ యువత బ్రాండ్లు, యాప్‌లు, రెస్టారెంట్లు లేదా ఇతర ఉత్పత్తులను ఎంపిక చేస్తుండగా, ఆ ఖర్చులను తల్లిదండ్రులు భరిస్తున్నారు.
ప్రస్తుతం Gen Zలో నలుగురిలో ఒకరు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగుల వాటా 2030 నాటికి 36 శాతానికి, 2035 నాటికి 47 శాతానికి చేరనుంది. దీనివల్ల 2035 నాటికి ఈ తరం చేసే వ్యయంలో 93 శాతం వారి సొంత సంపాదన నుంచే రానుంది.
ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నారు?
భారత్‌లో ఖర్చయ్యే ప్రతి రూపాయిలో దాదాపు సగం వాటా Gen Z ప్రత్యక్ష లేదా ప్రభావిత కొనుగోళ్లతోనే ముడిపడి ఉంటోంది. ఫుట్‌వేర్, ఫ్యాషన్, బయట భోజనం (Eating Out), అవుట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రయాణాలు, ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్లలో వీరి పాత్ర అత్యధికంగా ఉంది.
బ్యూటీ & పర్సనల్ కేర్ విప్లవం..
రెడ్‌సీర్ (Redseer) నివేదిక ప్రకారం భారత్‌లో బ్యూటీ మార్కెట్ 2030 నాటికి $40 బిలియన్లకు చేరుకోనుంది. ఇందులో సగం ఖర్చు Gen Z ఇంకా Gen Alpha నుంచే రానుంది. అలాగే ఆన్‌లైన్ బ్యూటీ అమ్మకాల్లో క్విక్ కామర్స్ వాటా ప్రస్తుత 15% నుంచి 40%కి చేరుతుందని అంచనా.
అవగాహనతో కూడిన స్కిన్‌కేర్..
కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా, ఉత్పత్తుల్లోని పదార్థాలు (Ingredients), ఫార్ములేషన్లను పరిశీలించే ధోరణి పెరిగింది. 74% మంది లేబుళ్లను చదువుతుండగా, నాణ్యమైన ఉత్పత్తుల కోసం 44% మంది అదనంగా ఖర్చు చేస్తున్నారు.
లైఫ్‌స్టైల్ జ్యువెలరీకి డిమాండ్..
భారీ బ్రైడల్ నగల కంటే తేలికపాటి, రోజూ ధరించే మోడ్రన్ లైట్‌వెయిట్ నగలవైపు మొగ్గు చూపుతున్నారు. బ్లూస్టోన్, టైటాన్ (beYon) లాంటి సంస్థలు ఈ తరానికి అనుగుణంగా ప్రొడక్ట్ డిజైన్లను మారుస్తుండటంతో ఈ విభాగం ఏటా 16-18% వృద్ధి సాధిస్తోంది.
చిన్న వయసులోనే పెట్టుబడులు, క్రెడిట్ వైపు మొగ్గు..
Gen Z కేవలం ఖర్చులకే పరిమితం కాకుండా చిన్న వయసులోనే సంపద సృష్టిపై దృష్టి పెడుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల వాటా మార్చి 2019లో 22.6% ఉండగా, జూలై 2025 నాటికి 38.9%కి పెరిగింది. దీనితో ఇన్వెస్టర్ల సగటు వయసు 38 నుంచి 33 ఏళ్లకు తగ్గింది. అలాగే జూలై 2026 నాటికి కొత్తగా డీమ్యాట్ రిజిస్ట్రేషన్లలో 30 ఏళ్లలోపు వారి వాటా 59%కి చేరింది.
మ్యూచువల్ ఫండ్స్ & క్రెడిట్..
మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో మిలీనియల్స్, Gen Z వాటా 48%గా ఉంది. మరోవైపు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం, 2024లో భారత్‌లో తొలిసారి క్రెడిట్ (New-to-credit) తీసుకున్న వారిలో Gen Z వాటా ఏకంగా 41%గా నమోదైంది. పొదుపు కంటే ముందే లోన్ లేదా ఈఎంఐ తీసుకోవడం ఈ తరం అలవాటుగా మారుతోంది. డిజిటల్ సాధనాలపై పట్టు, స్వతంత్ర నిర్ణయాధికారం, రిస్క్ తీసుకునే తత్వం ఈ తరాన్ని భారత వినియోగ, పెట్టుబడి విపణులలో అత్యంత శక్తివంతమైన డ్రైవర్‌గా నిలబెడుతున్నాయి.