Hydra Ranganath: హైదరాబాద్ అభివృద్ధి సంస్థ (హైడ్రా)పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఘాటుగా స్పందించారు. బాచుపల్లి తహశీల్దార్ జారీ చేసిన నోటీసులను హైడ్రాతో అనుసంధానిస్తూ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
“బాచుపల్లి తహశీల్దార్ జారీ చేసిన నోటీసులకు హైడ్రాతో ఎలాంటి సంబంధం లేదు” అని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ నోటీసు, ప్రతీ కూల్చివేతకు హైడ్రానే కారణమంటూ ఆరోపణలు చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడం తగదని హెచ్చరించారు.
“కబ్జాదారుల పట్ల హైడ్రా కఠినంగా ఉంటుంది. అయితే 2024 జులైకు ముందు నిర్మించబడిన ఇళ్లకు హైడ్రా ఏ విధంగా జోక్యం చేసుకోదు” అని ఆయన తెలిపారు. అలాగే, అనుమతులు ఉన్న వాణిజ్య సముదాయాలను తొలగించే ఉద్దేశం హైడ్రాకు లేదని స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వ్యాఖ్యానించిన రంగనాథ్, హైడ్రా వ్యవహారాలను రాజకీయంగా వక్రీకరించొద్దని హితవు పలికారు.