Dgmo: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) రాజీవ్ ఘాయ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో దాడులకు తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు.
“నిన్న పాక్ DGMO నాతో మాట్లాడి కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. అందుకు అంగీకారంతోపాటు కాల్పుల విరమణను పాటించాల్సిందిగా స్పష్టం చేశాం. అయినప్పటికీ, అదే రాత్రి పాక్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీనిపై వివరణ కోరామని, ఇకపై మరోసారి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశాం” అని రాజీవ్ ఘాయ్ అన్నారు.
అలాగే భారత సైన్యం 21 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిందని వెల్లడించారు. “అవసరమైతే మిగిలిన శిబిరాలపై కూడా ముందుగా చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాదుల అంతిమయాత్రలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రపంచం చూసింది. పాక్ జెట్లను అనేకం కూల్చేశాం. మొత్తం సంఖ్యను ఇప్పుడే వెల్లడించలేం” అని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారని, వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం ప్రకటించారు.
“మా లక్ష్యాలన్నింటినీ సాధించాము. అన్ని పైలట్లు సురక్షితంగా తిరిగివచ్చారు. పాక్ భారత్ పైలట్‌ను పట్టుకున్నదన్న ప్రచారం అసత్యం. పాక్‌ను నమ్మలేం. మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని డీజీఎంఓ ఘాయ్ హెచ్చరించారు.