Hyderabad: రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ మహానగరం 2025 నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలింది. ఎక్కడికక్కడ వేడుకలు జరుపుకునే వేదికలన్నీ ఫుల్ అయ్యాయి. బార్లు, పబ్‌లు, హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లు జనం సందడితో నిండిపోయాయి. నగరవాసులు కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ, గతేడాదికి వీడ్కోలు పలుకుతూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ వేడుకల్లో ఎందరో తాగి ఊగారు. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలతో వేలాది మంది జాగ్రత్తలు పడ్డారు. కానీ, ఇంకా కొందరు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.
Hyderabad: ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలువురు పట్టుబడాల్సి వచ్చింది. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా 1184 మంది వాహనదారులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. వారందరిపైనా కేసులు నమోదయ్యాయి. నగరంలోని ఈస్ట్ జోన్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ జోన్ పరిధిలో 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో 192, వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సెంట్రల్ జోన్‌లో 102, సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో 179 కేసుల చొప్పున నమోదయ్యాయి.