Hyderabad: హైదరాబాద్ శివారులోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 42కు చేరింది. మృతుల కుటుంబ సభ్యుల రోదన ఘటన స్థలాన్ని హృదయ విదారకంగా మార్చింది. పరిశ్రమ చుట్టూ, ఆసుపత్రులు, మార్చురీల వద్ద బాధిత కుటుంబ సభ్యులు బీభత్సానికి గురై ఉన్నారు.
పాశమైలారంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు సంఘటన స్థలంలో అహర్నిశలు శ్రమించి మృతదేహాలను వెలికితీస్తున్నాయి. ప్రస్తుతం 8 మందికి ఇంకా ఆచూకీ లేదు. వారిలో ఒకరు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
పేలుడు ఘటనలో గాయపడిన 23 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.
శవాలు తీవ్రంగా కాలిపోవడం వల్ల పలువురిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం డీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. మృతుల కుటుంబ సభ్యులు పరిశ్రమ, ఆసుపత్రులు, మార్చురీల చుట్టూ తిరుగుతూ తమ బంధువుల ఆచూకీ కోసం నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ ఘోర ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారో లేదో అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ప్రభుత్వానికి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.