Honey Trap: హైదరాబాద్ నగరంలోని సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లోని పబ్‌లపై నగర పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. ఇటీవల డేటింగ్ యాప్‌ల ముసుగులో అమాయక యువకులను ఆకర్షించి, పబ్‌లకు రప్పించి భారీగా బిల్లులు వేసి మోసగిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పోలీసులకు 70కి పైగా ఫిర్యాదులు అందగా, బాధితులు దాదాపు ₹35 లక్షలకు పైగా నష్టపోయినట్లు తేలింది. వీటిలో 33 కేసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కాగా, మిగిలినవి ఇతర కమిషనరేట్ల పరిధిలో నమోదయ్యాయి. ఈ రాకెట్ వెనుక కొన్ని పబ్ యాజమాన్యాల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తుండటంతో వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.
డేటింగ్ యాప్‌లలో పరిచయమైన మహిళలు బాధితులను ముందుగానే ప్లాన్ చేసుకున్న పబ్‌లకు తీసుకెళ్లడం, అక్కడ కొద్దిపాటి ఆహారం, డ్రింక్స్‌కే వేలల్లో (ఓ బాధితుడికి ఏకంగా ₹28,000 బిల్లు వేశారు) ఫేక్ లేదా ఎగ్జాబిటెంట్ బిల్లులు వేయించడం చేస్తున్నారు. బాధితులు బిల్లు కట్టిన వెంటనే సదరు మహిళలు అక్కడి నుంచి మాయమవుతున్నారు. ఈ మోసాలపై స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), సైబర్ క్రైమ్ పోలీసులు మరియు షీ టీమ్స్ (SHE Teams) సంయుక్తంగా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. పబ్ నిర్వాహకులకు, ఈ ముఠాలకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సీసీటీవీ దృశ్యాలు, డిజిటల్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని 33కి పైగా పబ్‌లపై స్థానిక నివాసితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. అర్థరాత్రి వరకు తీవ్ర శబ్దాలతో మ్యూజిక్ పెట్టడం, పబ్ సమయాల ఉల్లంఘన, మైనర్లకు మద్యం సరఫరా చేయడం, రోడ్లపై న్యూసెన్స్ చేయడం వంటి అంశాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనల ప్రకారం ఆదివారం నుంచి గురువారం వరకు అర్ధరాత్రి 12:00 గంటలకు, శుక్ర-శనివారాల్లో రాత్రి 1:00 గంట వరకు మాత్రమే పబ్‌లకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచితులతో డేటింగ్ యాప్స్ ద్వారా కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే ‘డయల్ 112’కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
