Police Raid

Police Raid: బేగంబజార్‌లో పోలీస్ రైడ్.. 16 మంది అరెస్ట్, 12 మంది పరారీ!

Police Raid: హైదరాబాద్ నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై గోషామహల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బేగంబజార్ పరిధిలోని ఓ చేపల గోదాంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ జూద స్థావరంపై మెరుపు దాడి చేసి నిర్వాహకుల గుట్టు రట్టు చేశారు. అర్ధరాత్రి వేళ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీల్లో పేకాట ఆడుతున్న 16 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా, మరో 12 మంది చీకట్లో పరారయ్యారు. నిందితుల నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలను పోలీసులు జప్తు చేసుకున్నారు.

అర్ధరాత్రి 12:20 గంటలకు రెయిడ్ – ఫిష్ గోదాంలో పేకాట క్లబ్!

పోలీసులు వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంబజార్ ఫిష్ మార్కెట్ సమీపంలో గల ‘ధనలక్ష్మి ఫిష్ గోదాం’లో కామన్ గేమింగ్ హౌస్ నిర్వహిస్తూ అక్రమంగా జూదం ఆడిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దింతో నవంబర్ 8 అర్ధరాత్రి దాటిన తర్వాత 00:20 గంటల సమయంలో గోషామహల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం గోదాంపై ఆకస్మిక దాడి చేసింది. గోదాంలోని రెండు పక్కపక్క గదుల్లో నగదు పందాలు కాస్తూ ‘అందర్-బాహర్’, ‘తీన్ పత్తి’ పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరో 12 మంది అక్కడి నుంచి తప్పించుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు..

పంచుల సమక్షంలో ఘటనా స్థలాన్ని సోదా చేసిన పోలీసులు కింది సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

  • నగదు: పందెం కాసేందుకు ఉపయోగిస్తున్న రూ. 23,800/- నగదు.

  • పేకాట ముక్కలు: 3 పేకాట సెట్లు.

  • స్మార్ట్‌ఫోన్లు: నిందితుల వద్ద నుంచి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (A-1 వద్ద నుంచి), వివో వీ29ఈ, వివో వీ27తో పాటు మరో వివో ఫోన్ కలిపి మొత్తం 4 ఖరీదైన మొబైళ్లను సీజ్ చేశారు.

నిందితుల వివరాలు – యూపీ వాసులే అధికం..

అరెస్టయిన నిందితులను గుల్షన్ సింగ్ (A-1), అంకిత్ సింగ్ (A-2), విజయ్ రాజ్ సింగ్ (A-3), వికాస్ బిరాదార్ (A-4), గాడేకర్ అనిల్ (A-5), అక్షిత్ సింగ్ (A-6), అంకిత్ (A-7), కరణ్ సోంకర్ (A-8), హరి ఓం (A-9), ప్రీతమ్ (A-10), మనీష్ (A-11), భాను (A-12), ప్రకాష్ (A-13), అంకిత్ కుమార్ (A-14), సందీప్ నిషాగ్ (A-15), ప్రేమ్ శంకర్ (A-16)లుగా గుర్తించారు.

నిందితుల్లో పలువురు బేగంబజార్, జిన్సీ చౌరస్తా, సీతారాంబాగ్‌లలో నివాసముంటుండగా.. మరికొందరు ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్, కాన్పూర్, హాజీపూర్‌గాం ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులుగా తేలింది. కాగా అడప్ప (A-17), అర్జున్ సింగ్ (A-18), అభిషేక్, అజయ్, దినేష్, మిథున్, అశుతోష్, ధీరజ్, కార్తీక్ సింగ్, వికాస్ సింగ్, విశాల్ సింగ్, అర్జున్ సింగ్‌లు పరారీలో ఉన్నారు.

కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు..

ఈ వ్యవహారంపై గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 419/2026 కింద కేసు నమోదైంది. తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 4తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 112(2) కింద కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన 12 మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గోదాములు, వాణిజ్య సముదాయాల యజమానులు తమ ప్రాంగణాలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కేటాయిస్తే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని ఇన్‌స్పెక్టర్ బి. శ్రావణ్‌ కుమార్ హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా అక్రమ జూదం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *