Weather Report: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించడంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రుతుపవనాలు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని, రానున్న నాలుగు ఐదు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా ఇవి మరింత ముందుకు సాగడానికి వాతావరణం అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గాలి మారుదల కారణంగా ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు వానలు
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. అయితే, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఇటు ఏపీలో కూడా రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు యానాం పరిసర ప్రాంతాల్లో ఈ వానలు కురుస్తాయి. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇకపోతే, రాబోయే ఐదు రోజుల్లో ఎండ తీవ్రత కాస్త తగ్గి, గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
