Hyderabad Rain

Hyderabad Rain: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఆఫీస్ టైంలో రోడ్లపై నరకం చూస్తున్న వాహనదారులు!

Hyderabad Rain: భాగ్యనగర ప్రజలను వరుణ దేవుడు పలకరించాడు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత.. ఈరోజు సాయంత్రం సిటీ మొత్తం ఒకేసారి వాతావరణం చల్లబడింది. ఎండ తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే, కరెక్ట్‌గా ఆఫీసులు వదిలి ఇళ్లకు వెళ్లే సాయంత్రం సమయంలో భారీ వర్షం ప్రారంభం కావడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట, మియాపూర్, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అలాగే అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మరోవైపు ఉప్పల్, నాగారం, అల్వాల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్ పరిసరాల్లో వాన కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో అటు వాహనదారులు, ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరో మూడు గంటల పాటు అలర్ట్.. జిల్లాలకు హెచ్చరికలు!
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రాబోయే మూడు గంటల పాటు అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు మూడు గంటల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.

అలాగే భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, గద్వాల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ అధికారులు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. వర్షం పడే సమయంలో ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *