HCU Issue:కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల వ్యవహారంలో ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ఈ రోజే భేటీ కానున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎట్టకేలకు ఆ భూముల్లో చేపట్టిన పనులను నిలిపివేశారు. సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముగ్గురు మంత్రులతో కూడి క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేశారు.
HCU Issue:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ కమిటీలో ప్రభుత్వం చోటు కల్పించింది. ఈ కమిటీ హెచ్‌సీయూ విద్యార్థులు, ఇతర ప్రజా సంఘాలు, అధ్యాపక బృందం, మేధావులతో చర్చించనున్నది. సాధ్యమైనంత సమయంలో ఈ కమిటీ నివేదిక ఇస్తుందని భట్టి విక్రమార్క ఈమేరకు తెలిపారు.
HCU Issue:విడతల వారీగా ఆయా వర్గాలతో ఈ మంత్రివర్గ కమిటీ భేటీ కానున్నది. వారి నుంచి సేకరించిన వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే ఒక స్టాండ్‌తో ఉన్న ఈ మంత్రులు, ఎలాంటి నివేదిక ఇస్తారోనన్న అంశంపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది. ఆ భూములు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానివేనని, హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేదని వారు తొలుత తేల్చి చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అయిన కొండా సురేఖకు క్యాబినెట్ కమిటీలో చోటు కల్పించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ, పర్యావరణ శాఖలపై ఆమె ప్రమేయం లేకుండా కమిటీ వేయడం తొందరపాటు చర్యగా పలువురు పేర్కొంటున్నారు.