HCU Issue: హెచ్‌సీయూ వివాదంలో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగడంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగిందా? ఈ విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వంపై మరక పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందా? ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అగ్రెసివ్‌గా ఉన్నారని భావించిన అధిష్టానం పూర్తిగా ఆయనను పక్కన బెట్టి డిప్యూటీ సీఎంతోనే పనికానిచ్చేస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
HCU Issue: హెచ్‌సీయూ వివాదంపై సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రాగానే ఏఐసీసీ అధిష్టానం స్పందించింది. వెంటనే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపింది. ఈ మేరకు ఆమె నేరుగా హైదరాబాద్ రానే వచ్చింది. ఇక్కడే ఉండి తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర పెద్దలతో మాట్లాడినట్టు తెలిసింది. హెచ్‌సీయూ విషయంలో తొందరపాటు చర్యగా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల అధిష్టానానికి తలవంపులు వస్తున్నాయంటూ మండిపడినట్టు విశ్వసనీయ సమాచారం.
HCU Issue: విద్యార్థులపై లాఠీచార్జికి ఎందుకు దిగాల్సి వచ్చిందని, ఫేక్ ఫొటోల ప్రచారం కొంత ఉన్నప్పటికీ మరికొన్ని వాస్తవాలను కాదనలేం కదా? అని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలను నిలదీసినట్టు సమాచారం. అదే విధంగా మీనాక్షి నటరాజన్ హెచ్‌సీయూ అధ్యాపకులతో, మేధావి వర్గంతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వారి నుంచి వచ్చిన వినతులను స్వీకరించారని, ఆ మేరకు దిద్దుబాటు చర్యలకు దిగారని అంటున్నారు.
HCU Issue: ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్‌లోనే మీటింగ్ పెట్టారని, ఆ సమావేశంలో ఏకంగా మీనాక్షి నటరాజన్ హాజరయ్యారని వార్తలు బయటకు వచ్చాయి. ఆ సమావేశంలో హెచ్‌సీయూ వివాదం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీపై మరక అంటకుండా ఉండేలా చొరవ తీసుకోవాలని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.
HCU Issue: ఈ దశలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోనే కాంగ్రెస్ అధిష్టానం పనికానిచ్చేసిందని తెలుస్తున్నది. అధిష్టానమే కీలక నిర్ణయాలు తీసుకొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వాటి అమలుకు పూనుకున్నదని వెల్లడైంది. వాటిలో భాగంగానే హెచ్‌సీయూలో పోలీస్ బలగాలను ఉపసంహరించుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు. ఇక వర్సిటీలో శాంతిభద్రతల బాధ్యత యూనివర్సిటీదే తేల్చిచెప్పారు.
HCU Issue: హెచ్‌సీయూ విద్యార్థులపై మోపిన కేసుల ఉపసంహరణకు కూడా పోలీస్ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలను జారీ చేవారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థుల విషయంలో కూడా పోలీసులకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వాలని న్యాయశాఖ అధికారులను భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. దీనినిబట్టే రేవంత్‌రెడ్డిని కాదని భట్టి వక్రమార్కతో ఏఐసీసీ పనికానిచ్చేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మున్ముందు హెచ్‌సీయూ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.