Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి.. మహారాష్ట్ర ప్రజలనూ మోసం చేసేందుకు అబద్ధాల నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు తీరును ఏకరువు పెట్టారు.
Harish Rao:100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ హామీలు ఎక్కడ అమలవుతున్నాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికీ 11 నెలలు అవుతుందని, మహిళలకు ఆ డబ్బులు ఇచ్చారా? అని నిలదీశారు. మహారాష్ట్రకు వెళ్లి మాత్రం తెలంగాణలో హామీలను అమలు చేసినట్టు చెప్తున్నారని విమర్శించారు.
Harish Rao: అధికారంలోకి వచ్చిన వారంలో రైతుల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశారని, ఇంకా 22 లక్షల మంది రైతులకు చేయాల్సి ఉన్నదని తేల్చి చెప్పారు. ఆలస్యంగా చేసిన రుఫమాఫీ వల్ల రైతులు వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా హామీలను అమలు చేయకుండా మహారాష్ట్రలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయనేలేదని హరీశ్‌రావు తెలిపారు.
Harish Rao: ఇచ్చిన హామీలను తప్పామని అక్కడ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా లేదు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వనేలేదు, వరి పంటకు రూ.500 బోనస్ ఇవ్వకున్నా, ఇస్తున్నామని మహారాష్ట్రలో చెప్పారని మండిపడ్డారు. ఎక్కడిచ్చారు, ఎవరికిచ్చారు? రేవంత్‌రెడ్డీ.. అని ప్రశ్నించారు. 11 నెలల కాలంలో రేవంత్‌రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, కానీ, ఉన్న ఇండ్లను కూలుస్తున్నడని ఆరోపించారు. పింఛన్లను పెంచి ఇస్తామని, ఇచ్చారా? అని ప్రశ్నించారు.
Harish Rao: 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని మహారాష్ట్రలో చెప్పారని, ఆ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇచ్చింది ఎవరు? పరీక్షలు పెట్టింది ఎవరు? ఇవన్నీ బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే జరిగాయని, నియామకాలు చేపట్టి తామే ఇచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్న మాటనే మరిచారని ధ్వజమెత్తారు.