Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెజెంటేషన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ప్రజలకు వివరించారు. “ఇది కేవలం రెండు పిల్లర్లు కుంగిన కేసు మాత్రమే. దానిని అడ్డంపెట్టుకొని మొత్తం ప్రాజెక్టు విఫలమైందని చెప్పడం దుష్ప్రచారం మాత్రమే” అని హరీష్‌రావు స్పష్టం చేశారు.
మూడు బ్యారేజీలు, అనేక వనరులు
హరీష్‌రావు వివరించగా, కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా మొత్తం 141 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉందన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే సాంకేతికతను వినియోగించామన్నారు.
“మేడిగడ్డ బ్యారేజీలో కేవలం రెండు పిల్లర్లు కుంగిపోయిన ఘటనను బీఆర్ఎస్‌ను బద్నాం చేయడానికి వాడుకుంటున్నారు. రిపేర్లు చేయకుండా ప్రభుత్వం ఇష్టపూర్వకంగా లేటు చేస్తోంది,” అని హరీష్ ఆరోపించారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉండటంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. “2007లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటికీ, నాలుగేళ్లలో అనుమతులు కూడా తెచ్చుకోలేకపోయారు. కనీసం నిర్మాణ పనులు ప్రారంభించకుండానే కాల్వలు తవ్వడం మొదలుపెట్టారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా రూ. 2,328 కోట్లు చెల్లించారు” అని ఆరోపించారు.
Also Read: Lakhpati Didi Yojana: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం..!
సాగు విస్తీర్ణం – 20 లక్షల ఎకరాలకు నీటి అందుబాటు
హరీష్‌రావు ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. యాసంగిలో కూడా పంటలు పండే పరిస్థితిని ఈ ప్రాజెక్టే సాధ్యపరిచిందని తెలిపారు. “ఇప్పటి వరకూ గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 940 టీఎంసీల్లో 400 టీఎంసీలు కూడా వినియోగించలేదు. కానీ కాళేశ్వరం వల్ల ఎన్నో చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిండాయి,” అని చెప్పారు.
రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
“కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ ప్రాజెక్టుపై అపోహలు కలిగించేలా వ్యవహరిస్తున్నాయి. కానీ బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలకు నిజాలు తెలియజేయడమే మా బాధ్యత” అని హరీష్‌రావు స్పష్టం చేశారు. కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.