Harish Rao

Harish Rao: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్.. “ఇది ప్రజా పాలనా? లేక పైరవీల పాలనా?”

Harish Rao: తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరిని ఎండగడుతూ బిఆర్ఎస్ నేత హరీష్ రావు గారు ఎక్స్ (X) వేదికగా సంధించిన ప్రశ్నలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి.

మంత్రికి తెలియని జీవోలు.. తెర వెనుక ఎవరు?

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కనీసం సమాచారం లేకుండానే టికెట్ల రేట్లు పెంచుతూ జీవోలు ఎలా వస్తున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. “శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది” అన్నట్లుగా సాగుతున్న ఈ పాలనలో, అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ రాజ్యాంగేతర శక్తి ఎవరని ఆయన నిలదీశారు. ఒక కేబినెట్ మంత్రే “నాకు తెలియదు” అని చేతులెత్తేయడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలా?

“నేను ఉన్నంత వరకు టికెట్ల రేట్లు పెంచను” అని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు వరుసగా సినిమాలకు రేట్లు పెంచుతూ సామాన్యుడిపై భారం వేయడం ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. తమకు నచ్చిన వాళ్లకు రూ. 600 వరకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ, నచ్చని వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Madaram Jathara 2026: ముంద‌స్తు భ‌క్తులు.. అడ్వాన్స్ మొక్కులు.. మేడారానికి పోటెత్తిన భ‌క్త‌జ‌నం

సినిమా రంగంపై కక్ష సాధింపు

గత పదేళ్లలో కేసీఆర్ గారు సినిమా పరిశ్రమను ఒక బిడ్డలా కాపాడుకున్నారని, అందుకే తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరిందని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా వాళ్లను తమ రాజకీయాలకు వాడుకుంటూ, పరిశ్రమలో వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప పగతో కాదని హరీష్ రావు హితవు పలికారు.

కమిషన్ల దందాపై విచారణకు డిమాండ్

సినిమా రేట్ల పెంపు వెనుక కోట్లాది రూపాయల కమిషన్ల దందా నడుస్తోందని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై గవర్నర్ గారు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *