Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండగా, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను పట్టించుకునే వారెవరూ లేరని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాపాలన కాదని, అది పూర్తిగా ప్రజావ్యతిరేకమైందని ఆరోపించారు. సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, గ్రామసభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నిరసన స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
హరీశ్ రావు మాట్లాడుతూ, “గ్రామాలు తిరగబడుతున్నాయి, ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తిగా విఫలమైంది. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ సభలు కూడా పోలీసుల పహారాలో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహిస్తూనే, కార్యకర్తలకే పథకాలు ఇస్తామని ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరంగా ఉంది. గ్రామసభలు నిర్వహిస్తూనే అర్హులైన వారికి పథకాలు అందించకపోతే, ఇక గ్రామసభలు ఎందుకు?” అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తే, వారు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు.
“కాంగ్రెస్ నేతల దుర్మార్గపు పాలన, అధికారులు అనుభవిస్తున్న శాపంగా మారింది. గ్రామసభలు, ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు అన్నీ కేవలం ప్రచార హంగుగానే మిగిలాయి. ప్రజలు ఇప్పుడు ఈ మోసాన్ని అర్థం చేసుకున్నారు.” అని హరీశ్ రావు విమర్శించారు.
ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం వంటివి దుర్మార్గపు పాలనకు నిదర్శనమని, ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. “తెలంగాణ ప్రజలు ఉప్పెనలా ఎగసిపడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలి. లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు,” అని హరీశ్ రావు హెచ్చరించారు.