Reactor Blast

Reactor Blast: గుజరాత్ ఫార్మా ఫ్యాక్టరీలో భీకర పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి..

Reactor Blast: గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాగ్రా తాలూకా పరిధిలోని సాయిఖా జీఐడీసీ (GIDC) పారిశ్రామిక వాడలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో భారీ రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన విషవాయువు పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు, పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హైడ్రోజనేషన్ వేళ పెను విషాదం – 15 కి.మీ మేర వినిపించిన శబ్దం..
పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  సాయిఖా పారిశ్రామిక వాడలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ తయారీ సంస్థ అయిన ‘సిన్‌జీల్ ఫార్మాకెమ్’ (SynZeal Pharmachem) యూనిట్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కార్మికులు విధుల్లో ఉన్నారు. సుమారు 15 కిలోలీటర్ల సామర్థ్యం గల భారీ రియాక్టర్‌లో హైడ్రోజనేషన్ (Hydrogenation) ప్రక్రియ జరుగుతుండగా ఒక్కసారిగా ఊహించని ఒత్తిడితో భీకర శబ్దంతో పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి రియాక్టర్ ట్యాంక్ పూర్తిగా ముక్కలైంది. భారీ యంత్రాల విడిభాగాలు, పదునైన లోహపు రేకులు ప్లాంటు వెలుపల చాలా దూరంలో వచ్చి పడ్డాయి. ఈ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. దాదాపు 15 కిలోమీటర్ల పరిధి వరకు పేలుడు శబ్దం వినిపించిందని పరిసర గ్రామాల ప్రజలు తెలిపారు.
విషవాయువు లీక్ – తీవ్ర కంటిమంటలు, శ్వాస సమస్యలు..
రియాక్టర్ బ్లాస్ట్ అయిన వెంటనే అందులోని ప్రమాదకరమైన ‘మిథిలీన్ డైక్లోరైడ్’ (Methylene Dichloride – MDC) విషవాయువు వాతావరణంలోకి భారీగా లీకైంది.
దీని కారణంగా ప్లాంటు పరిసరాల్లో దట్టమైన తెల్లటి పొగ అలుముకుంది. ఈ గ్యాస్ పీల్చిన ఇతర కార్మికులు, రెస్క్యూ సిబ్బంది తీవ్ర కంటిమంట, గొంతు మంట, శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిసర పారిశ్రామిక యూనిట్లలోని కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఫోమ్, వాటర్ స్ప్రేల సాయంతో గ్యాస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చారు.
మృతులు, క్షతగాత్రుల వివరాలు..
ఈ ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు కార్మికులను అధికారులు అధికారికంగా గుర్తించారు..
  1. జయదీప్ మహేష్‌భాయ్ పటేల్ (27): షిఫ్ట్ ఇన్‌చార్జ్ (ఆమోద్ ప్రాంతం)
  2. వృంద్ తలావియా: గిర్ సోమ్‌నాథ్ జిల్లా
  3. భవిక్ దిలీప్‌కుమార్ వసవా: స్థానిక కార్మికుడు
  4. అనికేత్‌కుమార్ హరిలాల్ గౌతమ్ (24): ఉత్తరప్రదేశ్
  5. అర్జున్‌కుమార్ రామ్‌సింగ్ గౌతమ్ (20): ఉత్తరప్రదేశ్
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భరూచ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్, మౌసమ్‌కుమార్, శివదయాళ్, ప్రతీక్ ప్రవీణ్, ప్రియాన్షు అనే కార్మికులను భరూచ్ మరియు వడోదరలోని ఆసుపత్రులకు తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఏడాది కూడా పూర్తికాని ప్లాంట్ – భద్రతా ప్రమాణాలపై విచారణ..
సాయిఖా జీఐడీసీలో ఈ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించి ఇంకా ఏడాది కూడా పూర్తికాకముందే ఇంతటి ఘోర ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి (GPCB), పారిశ్రామిక భద్రత మరియు ఆరోగ్య శాఖ (DISH) సంయుక్తంగా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. హైడ్రోజనేషన్ ప్రాసెస్‌లో ప్రెజర్ వాల్వ్ వైఫల్యం జరిగిందా లేక ఉష్ణోగ్రత నియంత్రణలో మానవ తప్పిదం ఉందా అనే కోణంలో ఫోరెన్సిక్ టీమ్ శాంపిల్స్ సేకరించింది.
భరూచ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మనీషా మనాణి మాట్లాడుతూ.. కంపెనీలో భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమవుతుందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *