Gudem Mahipal Reddy: కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య వైరం చల్లారడమే లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు, క్యాడర్‌పై తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి మధ్య వైరం కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిత్యకృత్యమవుతున్నాయి. ఈ గొడవలతో ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. పటాన్‌చెరులో జరిగిన ప్రొటోకాల్ వివాదం అందుకు నిదర్శనంగా నిలిచింది.
Gudem Mahipal Reddy: పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ముక్కోణపు వైరం నెలకొని ఉన్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన కాటా శ్రీనివాస్‌గౌడ్, నీలం మధు ముదిరాజ్ వర్గాలుగా కొనసాగుతున్నాయి. ఒకరంటే మరొకరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం నెలకొని ఉన్నది.
Gudem Mahipal Reddy: ఈ దశలో బొల్లారంలో రోడ్డును ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అక్కడికి చేరిన కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించాల్సి ఉండగా, ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ పెద్ద పెట్టున కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పనులు పూర్తికాక ముందే రోడ్డును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మంత్రి వచ్చాకే రోడ్డును ప్రారంభించాలని పట్టుబట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే దుర్భాషలాడారు. మహిపాల్‌రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాలను పోలీసులు వారించడంతో గొడవ సద్దుమణిగింది.