Gold Rate Hike: మన దేశంలో అందరూ ఎంతో ఆసక్తిగా తెలుసుకోవాలనుకునే అంశాల్లో బంగారం ధరలు ఒకటి. నిత్యం పైకీ కిందకీ కదిలే బంగారం ధరల గురించి అందరిలోనూ ఉత్సుకత ఉంటుంది. ఎందుకంటే, మన దేశంలో ప్రజలకు బంగారానికి మధ్య విడదీయరాని బంధం ఉంది. బంగారు ఆభరణాలపై విపరీతమైన మోజు మన ప్రజలకు. పెళ్లి.. పేరంటం.. పుట్టినరోజు.. గిట్టినరోజు ఇలా ఏ కార్యక్రమానికైనా బంగారం లేకుండా పనిజరగదు. డబ్బున్నా లేకపోయినా బంగారం కొనకుండా లేదా బంగారం ప్రసక్తి లేకుండా ఏ ఈవెంట్ కూడా భారత్ లో జరగదు. స్తోమతును బట్టి ఎంతో కొంత బంగారం కొనడం తప్పనిసరి. అందుకే ఇక్కడ బంగారం డిమాండ్ తో పాటు ధరలు కూడా అటూ ఇటూ మారిపోతూ ఉంటాయి.
ఇక గత రెండు వారాలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు దీనికి ఒక కారణం అయితే, స్థానికంగా ఉన్న కొన్ని అంచనాలు ఈ పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. తాజాగా దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.82 వేలకు చేరుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. దీనికి కారణం కేంద్ర బడ్జెట్. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే, ఈసారి బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచడం జరగొచ్చు. గతేడాది బడ్జెట్ లో ఈ సుంకాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించింది. అప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం ధరలు బాగా తగ్గాయి. అయితే, ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారాయి. బంగారం ధరలు తగ్గడంతో వినియోగం పెరిగింది. ఇలా బంగారం విపరీతంగా కొనడం దేశంలో వాణిజ్య లోటును పెంచింది. ఈ వాణిజ్య లోటు మరింత పెరగకుండా నిలువరించాలంటే కచ్చితంగా బంగారంపై సుంకాలను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతుందని అందరూ నమ్ముతున్నారు.
అదే నిజమైతే, బంగారం ధరలకు రెక్కలు రావడం ఖాయం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ తరువాత బంగారం ధరలు పెరుగుతాయనే గట్టి అంచనాను నిపుణులు వేస్తున్నారు. అంతేకాకుండా మార్చి నెల నుంచి మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతోంది. అందువల్ల బంగారం డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే బంగారం ధరలు పెరుగుదల జరగొచ్చని నమ్మవచ్చు. నిపుణులు కూడా అదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.. ఫిబ్రవరి తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో?

