Gandhi Tatha Chettu Review: మన తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు సుకుమార్. ఆయన వారసురాలు సుకృతి తెరగేట్రం చేసిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ఇప్పటికే సత్తా చాటి పలు అవార్డులను గెచుకుందీ చిత్రం. ఉత్తమ బాలనటిగా సుకృతి సైతం అవార్డును సాధించింది. సుకృతి ప్రతిభకు గతేడాదే దాదాసాహేబ్ ఫాల్కే ఫిలిమ్ ఫెస్టివల్ పురస్కారం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా జనవరి 24, శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం…
Gandhi Tatha Chettu Review: కథ విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో ఓ పల్లెటూరులో రైతు రామంచంద్రయ్య (ఆనంద్ చక్రపాణి)కి గాంధీజీ అంటే ఎంతో అభిమానం. గాంధీ చనిపోయినపుడు ఆయన గుర్తుగా తన పొలంలో ఓ మొక్క నాటుతాడు. అది పెరిగి పెద్దై వటవృక్షంగా మారి నీడనిస్తుంది. అదంటే రామచంద్రయ్యకు ప్రాణం. ఇక గాంధీ మీద అభిమానంతో తన మనవరాలికి కూడా అదే పేరు పెడతాడు. గాంధీ (సుకృతి వేణి)కి తాతంటే ఎంతో ప్రేమ. ఇదిలా ఉంటే చేతికి వచ్చిన పంట అమ్ముకోలేక ఊరి వారందరూ పొలాలను అమ్మేసుకుంటారు. అయితే రామచంద్రయ్య మాత్రం తన పొలం అమ్మనంటాడు. అమ్మితే చెట్టుకొట్టేస్తారని, ఆ చెట్టును కాపాడతానని మనవరాలు గాంధీ దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. మరి తాతకు ఇచ్చిన మాట కోసం గాంధీ ఏమి చేసింది. మాట నిలబెట్టుకుందా!? అందులో భాగంగా తనకెదురైన అనుభవాలేంటి!? అన్నదే ఈ చిత్రం కథ.
Gandhi Tatha Chettu Review: ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ తో మొదలెట్టి పూర్తి చేశారు. ఆ తర్వాత మైత్రీ మూవీస్ ఎంటరై సినిమాను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. ప్రజల దైనందిన జీవితాలలో పాటు సినిమాలలోనూ చెడునే హైలైట్ చేస్తూ వస్తున్న ప్రస్తుతం రోజుల్లో ‘చెట్టును కాపాడుదాం… అది మనల్ని, ఊరిని కాపాడుతుంది’ అనే అంశంతో సినిమా తీయటం అభినందనీయం. అది జనరంజకంగా ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘గాంధీ తాత చెట్టు’లో చెట్టు మీద మనుషుల ప్రేమ… దానిని కాపాడటం కోసం వారు పడిన తపనను సినిమాగా మలచిన దర్శకనిర్మాతలను అభినందించాలి. ఇందులో లోపాలు లేవా? అంటే ఉన్నాయి. కానీ వాటికంటే ఎంచుకున్న లైన్ ఉదాత్తమైనది.

Gandhi Tatha Chettu Review: అసలు ఈ లైన్ తో సినిమా తీయాలనే ఆలోచన రావటమే ఓ గొప్ప విషయం. ఇక దానిని అందుబాటులో ఉన్న వనరులతో తెరకెక్కించిన తీరు అభినందనీయం. క్షణానికి ఒక అబద్దం ఆడవలసి వస్తున్న ఈ రోజుల్లో నిజమే చెప్పాలి. తాత నేర్పిన ఆదర్శాలకు కట్టుబటి చుట్టూ ఉన్నవారు కూడా అలాగే ఉండాలని గాంధీ పాత్రద్వారా చూపించిన తీరు చూస్తే నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సినిమా చూసిన వేలాది మంది విద్యార్దులలో ఒక్కరైనా అలా అబద్దం చెప్పకూడదు. నిజమే మాట్లాడాలనే మార్పు తీసుకురాగలిగితే దర్శకురాలు పద్మావతి ప్రయత్నం నెరవేరినట్లే. కాపీ కొడుతున్నారని స్నేహితులని పట్టించి వారు దెబ్బలు తింటుంటే బాధ పడటం, తర్వాత స్నేహితులనే అడిగి వారితో దెబ్బలు తినటం. తమని పట్టించి కొట్టించిన గాంధీని ఆ స్నేహితులు సైతం అభిమానించటం.. ఇవన్నీ నిజ జీవితంలో కూడా జరిగితే ఎంత బాగుంటుందో కదా అనిపించక మానదు.
Gandhi Tatha Chettu Review: నటీనటుల విషయానికి వస్తే సుకృతి గాంధీ పాత్రను ఎంతో ఆవాహన చేసుకుని పోషించినట్లు ఇట్టే అర్థం అవుతుంది. సుకృతితో పాటు తాతగా నటించిన రామచంద్రయ్య పాత్రధారి ఆనంద చక్రపాణి కూడా ఎలాంటి అతి లేకుండా తమ పాత్రలను పోషించిన తీరును మెచ్చుకోవలసిందే. ఇక చెట్టుకు తనికెళ్ళ భరణి గాత్రం చక్కగా అమరింది. చిత్రంలో నటించిన సుకృతి తల్లిదండ్రుల పాత్రధారులతో పాటు ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మీరకుండా అద్బుతంగా పోషించారనే చెప్పాలి. షుగర్ కి ప్రత్యామ్నాయంగా బెల్లం తయారు చేయటం, సినిమా ఆసాంతం స్లోగా సాగటం వంటివి ఉన్నా మెయిన్ పాయింట్ ముందు భరించ తగ్గవే అనిపిస్తుంది. ఇక సుకృతి గుండు అంశం తన పెళ్ళి కోసం కాకుండా చెట్టును కాపాడే అంశంతో ముడిపెట్టి ఉంటే ఇంకా బాగుండేది. రీ నేపథ్య సంగీతం సినిమా ఎత్తుగడను అనుసరించి సాగుతుంది. ఇక ఊరి అందాలను ఇండీ కెమెరా బాగానే క్యాప్చర్ చేసింది.
Gandhi Tatha Chettu Review: తొలిసారి దర్శకత్వం చేయాలనుకునే వారు ఏ ప్రేమకథనో, యాక్షన్ ఎంటర్ టైనర్ నో ఎంపిక చేసుకుంటారు. చంద్రశేఖర్ ఏలేటి, నాగ్ అశ్విన్ వంటి దర్శకుల వద్ద పని చేసిన పద్మావతి మాత్రం అందుకు భిన్నంగా సోషల్ ఎవేర్ నెస్ ని పెంచే అంశంతో కథను తయారు చేసుకుని సినిమా తీయాలనుకోవడం అభినందించి తీరవలసిన విషయం. ఇక దీనిని నిర్మించాలనే సాహసం చేయటం, క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నించి సఫలం అయి సినిమాగా తీయటం, దానికి మైత్రీ మూవీస్ వారు సహకరించి ఆడియన్స్ ముందుకు తీసుకురావటం ఇవన్నీ కూడా వారి వారి అభిరుచులను చాటుకోవడమే. ఇలాంటి సినిమాను ప్రోత్సహించినపుడే మరిన్ని మంచి సినిమాలు రావటానికి మన ముందుకు రావటానికి ఆస్కారం ఉంటుంది. అది జరుగుతుందా? అంటే… ఏమో గుర్రం ఎగురావచ్చు…
థంబ్: అభినందించదగ్గ ప్రయత్నం
రేటింగ్: 2.5/5

