Train Accident: ముంబై నగరాన్ని దిగ్బ్రాంతికి గురిచేసే ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం (జూన్ 9) ముంబ్రా వద్ద జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దివా నుంచి ముంబ్రా దిశగా వెళ్తున్న లోకల్ ట్రైన్లో అధిక రద్దీ కారణంగా పలువురు ప్రయాణికులు ఫుట్బోర్డింగ్లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు.
ప్రమాద వివరాలు:
ప్రయాణికులు ట్రైన్ డోర్లకు వేలాడుతూ ప్రయాణిస్తున్న సమయంలో, అదుపుతప్పి రైలు నుంచి జారి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 నుంచి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
రద్దీనే కారణం
ముంబైలో రోజువారీ రైలు ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఫుట్బోర్డింగ్ అనేది ఇక్కడ సహజం. అయితే, ట్రైన్లో ఆమడ దూరం ప్రయాణికులు నిలబడి ఉండేంత రద్దీ ఉండడంతో, సురక్షితంగా ప్రయాణించడం చాలా మంది కోసం సాధ్యపడదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ప్రయాణికులు డోర్లకు వేలాడుతూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం
ప్రమాదంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. రైల్వే భద్రతా అధికారులు సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ స్పందన అవసరం
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా, పట్టాలపై ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన పటిష్ట చర్యలు తీసుకోవడంలో రైల్వే శాఖ విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల జీవితం పణంగా పెట్టే ఫుట్బోర్డింగ్కు అడ్డుకట్ట వేసే విధంగా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
