US-Iran War

US-Iran War: ఎఫ్-35 యుద్ధ విమానం కూల్చివేత.. పైలట్ కోసం వేట!

US-Iran War: అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. నైరుతి ఇరాన్ వైమానిక పరిధిలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఎఫ్-35 (F-35) ఫైటర్ జెట్‌ను తమ దళాలు కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ భూభాగంలో ఒక అమెరికన్ యుద్ధ విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి కావడంతో అంతర్జాతీయంగా పెను సంచలనం రేగుతోంది. ప్రస్తుతం ఆ విమాన పైలట్ ఆచూకీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పైలట్ కోసం ఇరాన్ భారీ నజరానా

విమానం కూలిపోతున్న సమయంలో అమెరికన్ పైలట్ ఎజెక్ట్ బటన్ నొక్కి, పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందకు దిగినట్లు సమాచారం అందుతోంది. మొదట పైలట్ తమ ఆధీనంలోనే ఉన్నాడని ప్రకటించిన ఇరాన్, ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. సదరు పైలట్‌ను సజీవంగా పట్టుకుని అధికారులకు అప్పగించిన వారికి భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ మీడియా ద్వారా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పైలట్‌ను బందీగా పట్టుకుంటే, అమెరికాపై ఒత్తిడి తీసురావడానికి ఇంకా  బేరసారాలు సాగించడానికి ఇరాన్‌కు ఒక బలమైన ఆయుధం దొరికినట్లు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మౌనంగా ఉన్న అమెరికా.. ధృవీకరించిన అంతర్జాతీయ మీడియా

ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) లేదా వైట్ హౌస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ మాత్రం అమెరికా యుద్ధ విమానం ఇరాన్ సరిహద్దుల్లో కూలిపోయిన మాట వాస్తవమేనని పేర్కొంది. విమానంలోని సిబ్బందిని కనుగొనేందుకు మరియు రక్షించేందుకు అమెరికా సైన్యం రహస్యంగా సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఒకవేళ పైలట్ ఇరాన్ సైన్యానికి చిక్కితే, యుద్ధ గమనం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

యుద్ధంలో కీలక మలుపు

ఇరాన్ ఈ విజయాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడం ద్వారా అమెరికా రక్షణ వ్యవస్థను దెబ్బతీశామనే సంకేతాన్ని పంపాలని చూస్తోంది. పైలట్ విడుదలకు ప్రతిగా కాల్పుల విరమణ ఒప్పందం లేదా ఇతర రాయితీలను అమెరికా నుండి ఆశించే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఎఫ్-35 విమానం కూలిపోవడం అమెరికా సైనిక వ్యూహాలకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో పైలట్ కోసం జరుగుతున్న గాలింపు చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *