Fire Accident: హైదరాబాద్ నగరంలో ఉన్న పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం (ఏప్రిల్ 14) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. బంజారాహిల్స్‌లో ఉన్న ఈ హోటల్ ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచి ఈ మంటలు వస్తున్నట్టు గుర్తించారు. హోటల్ నుంచి భారీగా పొగ వెలువడుతుందని స్థానికులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో కూడా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
Fire Accident: హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హోటల్ వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను ఆదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు విచారణ కొనసాగుతున్నది. మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మొదట ఏ అంతస్థులో మంటలు వ్యాపించాయి? ప్రమాదమా? ఎవరైనా కావాలని చేశారా? అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ పార్క్ హయత్ హోటల్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు క్రీడాకారులు ఉంటున్నారు. ఇదే హోటల్లో ఈ రోజు సాయంత్రం ఓదెల-2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటు క్రికెట్, సినీ అభిమానుల్లో ఆందోళన నెలకొన్నది. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.