Union Budget 2026

Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్ 2026.. సామాన్యుడి ఆశలు నెరవేరేనా?

Union Budget 2026: నేడే పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేసే దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేయనుంది.

75 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. గత 75 ఏళ్లుగా బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్-బి కేవలం పన్నులు, సాంకేతిక అంశాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి ‘పార్ట్-బి’లో దేశ భవిష్యత్తును మార్చే కీలక విధానాలను, దీర్ఘకాలిక లక్ష్యాలను మంత్రి ప్రకటించనున్నారు. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టే ప్రణాళికలు ఇందులో ఉండబోతున్నాయి.

తయారీ రంగానికి కొత్త ఊపిరి స్థానిక కంపెనీలను ప్రోత్సహించేలా కస్టమ్స్ డ్యూటీ పన్నుల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. నిబంధనలను సులభతరం చేయడం ద్వారా వ్యాపారస్తులకు ఉన్న ఇబ్బందులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఎగుమతులను పెంచడానికి ‘స్పెషల్ ఎకనామిక్ జోన్ల’ను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు.

పల్లెలకు పండగ.. వ్యవసాయానికి ప్రాధాన్యత ఈ బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు, రైతులకు పెద్దపీట వేయబోతున్నారు. పల్లెల్లో ఉపాధి పెంచేందుకు నిధులను భారీగా పెంచే అవకాశం ఉంది. గత ఏడాది ఉపాధి హామీ పథకానికి రూ. 86,000 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని దాదాపు 72 శాతం పెంచి రూ. 1.51 లక్షల కోట్లకు చేర్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త కళ రానుంది.

అందరి చూపు పన్ను మినహాయింపులపైనే మౌలిక సదుపాయాలు, రక్షణ, విద్యుత్ మరియు గృహ నిర్మాణ రంగాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే, మధ్యతరగతి ప్రజలు మాత్రం ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా నిర్మలమ్మ ఎలాంటి ప్రకటనలు చేస్తారో మరికొద్ది సేపట్లో తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *