Venezuela: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో శనివారం తెల్లవారుజామున యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ దేశ రాజధాని కరాకస్‌లో వరుసగా ఏడు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించడంతో నగరం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ల ధాటికి భయంతో వణికిపోయిన స్థానిక ప్రజలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. పేలుళ్లతో పాటు నగరానికి అతి తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలు గర్జించిన శబ్దాలు వినబడటంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అమెరికా, వెనెజులా మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిణామంతో తారాస్థాయికి చేరుకున్నాయి. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మడురో ప్రభుత్వం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాలను మరియు మడురో ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా ఇప్పటికే కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్‌లను మోహరించింది. ముఖ్యంగా డ్రగ్స్ తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లే లక్ష్యంగా అమెరికా దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలోనే కరాకస్‌లో ఈ పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read: Farmers Protest: సోయా రైతుల పోరు.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పంట కొనాలని ఆదిలాబాద్ రైతుల ఆవేదన
ఈ దాడుల కారణంగా కరాకస్ నగరంలోని కీలకమైన పోర్టులు, విమానాశ్రయాలు మరియు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. పేలుళ్ల అనంతరం రాజధాని నగరం అంతా అంధకారంలో మునిగిపోయింది. వెనెజులా ముఠాల నుంచి అమెరికాలోకి భారీగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, దీనిని అరికట్టేందుకు వెనెజులా భూభాగంపై దాడులు చేస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. తాజా పరిణామాలను గమనిస్తుంటే ఇది అమెరికా వైమానిక దాడుల ఫలితమేనని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు, అయితే అగ్రరాజ్యం నుంచి దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
