Jagital: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్‌ల వాడకం పెరుగుతున్నది. పెట్రోల్ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది వీటినే ఆశ్రయిస్తున్నారు. అయితే మెయింటెనెన్స్, విద్యుత్ చార్జింగ్ నిర్వహణలోపాలతో తరచూ అక్కడక్కడా ఎలక్ట్రిక్ బైక్‌లు పేలుతున్నాయి. దీంతో వినియోగదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ ఇంటిలో ఉంచి, చార్జింగ్ పెట్టిన సమయంలో ఓ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి దగ్ధమైంది. దానితో పాటు తీవ్ర నష్టం వాటిల్లింది.
Jagital: జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన భేతి తిరుపతిరెడ్డి ఇటీవలే ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. వ్యవసాయ పనుల కోసం ఈ బైక్‌ను వినియోగిస్తున్నాడు. చార్జింగ్ తగ్గడంతో ఇంటి ఆవరణలోనే ఉన్న ప్లగ్‌లో చార్జింగ్ పెట్టాడు. పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బైక్ పేలిపోయింది. దీంతో మంటల వ్యాపించి, ఇంటికీ అంటుకున్నాయి. ఇల్లు ముందు భాగం కాలిపోయింది. అయితే ఈ బైక్‌తో పాటు బైక్ డిక్కీలో ఉంచిన రూ.1.90 లక్షల నగదు కూడా కాలి బూడిదైంది.
Jagital: బైక్ పేలిన సమయంలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బైక్ కొని 40 రోజులవుతుందని, తీవ్ర నష్టం జరిగిందని, బైక్‌తోపాటు కాలిన నగదును పరిహారం ఇవ్వాలని బాధితుడు తిరుపతిరెడ్డి కోరుతున్నాడు.