Cyber Fraud

Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ.. వృద్ధ దంపతుల నుంచి రూ.14 కోట్లు మాయం!

Cyber Fraud: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ డాక్టర్ దంపతులను భయభ్రాంతులకు గురిచేసిన కేటుగాళ్లు, ఏకంగా రూ.14.85 కోట్లను కాజేశారు. సుమారు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉంటూ, ఐక్యరాజ్యసమితి (UN)లో సేవలు అందించి భారత్‌కు తిరిగి వచ్చిన డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజాలను ఈ సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు.

భయం గుప్పిట్లో 18 రోజులు.. డిసెంబర్ 24న మొదలైన ఈ హై-టెక్ దోపిడీ జనవరి 10 వరకు కొనసాగింది. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, మీపై మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని, అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయని దంపతులను నమ్మించారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దాదాపు 18 రోజుల పాటు వారిని నిరంతరం వీడియో కాల్స్‌లో ఉంచి నిఘా పెట్టారు. జాతీయ భద్రత, మనీ లాండరింగ్ చట్టాల పేరు చెప్పి వారిని ఎంతలా భయపెట్టారంటే, తమ ప్రాణాలు కాపాడుకోవడానికి డాక్టర్ ఇందిరా తనేజా వివిధ విడతల్లో ఎనిమిది బ్యాంకు ఖాతాలకు రూ.14 కోట్లకు పైగా బదిలీ చేశారు.

పోలీస్ స్టేషన్‌లో బయటపడ్డ నిజం.. జనవరి 10వ తేదీన మోసగాళ్లు ఆ దంపతులతో ఒక వింతైన మాట చెప్పారు. “మీరు పంపిన డబ్బును ఇప్పుడు RBI తిరిగి ఇస్తుంది, మీరు వెళ్లి మీ లోకల్ పోలీస్ స్టేషన్‌లో కలవండి” అని నమ్మబలికారు. ఇందిరా తనేజా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు కూడా నేరగాళ్లు ఆమెతో వీడియో కాల్‌లోనే ఉన్నారు. స్టేషన్‌లో ఉన్న పోలీసు అధికారులతో కూడా వారు దురుసుగా మాట్లాడటంతో అసలు విషయం బయటపడింది. తాను మోసపోయానని గ్రహించిన ఇందిరా తనేజా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ యూనిట్ (IFSO) దర్యాప్తు చేస్తోంది.

జాగ్రత్తగా ఉండండి: చట్టప్రకారం మన దేశంలో “డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదు. పోలీసులు లేదా ఇతర దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ వీడియో కాల్స్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేయవు లేదా డబ్బులు అడగవు. ఎవరైనా ఫోన్ చేసి భయపెడితే వెంటనే భయపడకుండా, స్థానిక పోలీసులకు లేదా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయడం మంచిది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *