YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలంగాణ హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసుల్లో రోజువారీ (Day-to-day) విచారణ చేపట్టాలని, జగన్‌తో పాటు సహ నిందితులందరూ విచారణకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా (Personal appearance) ఆదేశాలు జారీ చేయాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. ఈడీ తాజా పిటిషన్‌తో వైఎస్సార్‌సీపీ వర్గాల్లో మళ్లీ తీవ్ర కలవరం మొదలైంది.
పదేళ్లుగా పెండింగ్‌లోనే 9 చార్జిషీట్లు – ఈడీ ప్రధాన వాదనలు..
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పలు కీలక అంశాలను లేవనెత్తింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన 9 చార్జిషీట్లు దాదాపు పదేళ్లుగా విచారణకు రాకుండా పెండింగ్‌లోనే ఉండిపోయాయని ఈడీ పేర్కొంది. నిందితులు వరుసగా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ప్రధాన విచారణ ముందుకు సాగడం లేదని తెలిపింది.
వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేయాలి..
కేసుల విచారణ సత్వరం ముగియాలంటే జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇతర నిందితులందరూ కోర్టు ఎదుట స్వయంగా హాజరయ్యేలా ఆదేశించాలని కోరింది.
దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు..
భారీ స్థాయి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక ఆరోగ్యానికే తీవ్ర విఘాతం కలిగిస్తాయని, ఇలాంటి కేసుల విచారణ ఆలస్యం కావడం ఏమాత్రం సమర్థనీయం కాదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
అక్టోబర్ 13న అన్ని పిటిషన్లపై ఉమ్మడి విచారణ..
ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది.
-
జగన్ అక్రమాస్తుల కేసులను త్వరితగతిన తేల్చాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యతో పాటు మరికొందరు గతంలోనే పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.
-
వాటన్నింటితో కలిపి తాజా ఈడీ పిటిషన్‌ను కూడా జత చేయాలని (Tag) రిజిస్ట్రీని ఆదేశించింది.
-
జగన్ కేసుల సత్వర విచారణకు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఈ నెల 13న హైకోర్టు సమగ్ర విచారణ చేపట్టనుంది.
కోర్టులకు వ్యక్తిగత హాజరు నుంచి గతంలో జగన్‌కు లభించిన మినహాయింపులపై ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ వేయడం, అది కూడా త్వరలోనే విచారణకు రానుండటంతో రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
