Donald trump: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు. ఈ సందర్భంగా తన అధికారాన్ని ఉపయోగించి వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్షలు మంజూరు చేస్తున్నారు. ఈ పరిణామంలో రెండు రోజుల క్రితం ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మందిలో 37 మందికి శిక్ష తగ్గించారు.
అయితే, బైడెన్ ఈ చర్యను కాబోయే అధ్యక్షుడిగా భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినమైన వైఖరి అవసరమని స్పష్టం చేశారు. తాను అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టాక హంతకులు, అత్యాచార నేరస్తులకు క్షమాభిక్షలు ప్రసాదించే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. మరణశిక్షలను అమలు చేయడంపై న్యాయశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తానని, దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని ఆయన పేర్కొన్నారు.
మరణశిక్షల విషయంలో అమెరికాలో రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి, మరో ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా అమలు నిలిపి ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో మరణశిక్ష కొనసాగుతోంది. అయితే, బ్యాంకు దోపిడీ సమయంలో హత్యలు చేసిన వారు లేదా తోటి ఖైదీలను హతమార్చిన వారిపై మరణశిక్షను అమలు చేస్తారు.
1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి మరణశిక్ష విధించగా, కేవలం 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన సమయంలో కేవలం ఆరు నెలల్లోనే 13 మందికి మరణశిక్ష అమలు జరిగింది. ప్రస్తుతం 40 మంది మరణశిక్షకు గురైన ఖైదీల్లో, బైడెన్ 37 మందికి క్షమాభిక్ష ప్రకటించారు.ఈ పరిణామాలు మరణశిక్ష అమలు విధానాలపై అమెరికాలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.